కడుపు నిండిన వాడు కాంగ్రెస్, కడుపు ఎండిన  వాడు కమ్యూనిస్ట్ అని ఓ ముతక సామెత ఉంది. అంటే కాంగ్రెస్ కి పోటాపోటీ ఇచ్చిన పార్టీలు దేశంలో  ఒకపుడు కమ్యూనిస్టులన్నమాట. నాడు నెహ్రూ టైం నుంచి ఇందిరాగాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీల వరకూ గద్దె దించాలంటే కమ్యూనిస్ట్ రంగంలోకి దిగాల్సిందే. కమ్యూనిస్టులకు ఇష్టులు ఎవరూ ఉండరు, వారు సొంతంగా ప్రభుత్వంలోకి వచ్చినా కూడా విమర్శలు ఆపరు.


అంటే వారిలో ఎక్కువ నెగిటివ్ అప్రోచ్ వుంటుందని కొందరు అంటే అది కాదు,  సమూలమైన మార్పులు వచ్చేంతవరకూ రాజీ పడని ధోరణి అని మరి కొందరు అంటారు. ఏది ఏమైనా ఈ దేశస్వాతంత్రానికి ముందు నుంచి ఉంటూ అనంతరం గత డెబ్బై ఏళ్ళకు పైబడి దేశానికి దశ దిశా చూపిన కమ్యూనిస్టులకు కాలం చెల్లిందా అన్న మాట వినిపిస్తోంది. సిధ్ధాంతబద్ధులుగా  ఉన్న వామపక్షాలు ఇటీవల కాలంలో ట్రాక్ తప్పయేమోనన్న ఆలోచన కూడా రాజకీయ మేధావుల్లో కలుగుతోంది.


చారిత్రాత్మకమైన తప్పులు అన్న మాట కమ్యూనిస్టుల నుంచే పుట్టింది. అయితే తప్పులు వరసగా చేస్తూ తామే చరిత్రగా మిగిలిపోతామని బహుశా కమ్న్యూనిస్టులు కూడా వూహించిఉండరు. దేశంలో ఇపుడు కమ్యూనిజం పెద్దగా లేదని అంటే కోపం రావచ్చు కానీ అది కఠిన సత్యం. ఇకకమ్యూనిస్టుల  భావ జాలం కూడా నయాతరానికి ఒంటబట్టడంలేదన్నది కూడా అంగీకరించాల్సిన వాస్తవం. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 1950 దశకం నుంచి 1970 దశకం వరకూ కమ్యూనిస్టులే కాంగ్రెస్ కి అసలైన ప్రతిపక్షాలు. ఓ దశంలో వారు అధికారంలోకి వస్తారా అన్నంతగా ప్రభావం చూపారు.


తరువాత జనతా పార్టీ, టీడీపీ వంటివి ఏర్పడ్డాక వారి ప్రభ తగ్గింది. తోక పార్టీలుగా మారాయి. ఇపుడు మరీ చిత్రం గడచిన రెండు ఎన్నికల్లోనూ అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కలేని దీన స్థితికి వచ్చేశాయి. మొత్తం మీద చూసుకుంటే వామపక్షాల‌కు ఇవి చెడు రోజులే అనుకోవాలి. జాతీయ పార్టీలుగా కూడా ఉనికి కోల్పోయినా సీపీఐ, సీపీఎం ఇపుడు ఏకంగా ఎన్నికల సంఘం  నుంచి గుర్తింపు రద్దును బహుమతిగా పొందడం స్వీయ వైఫల్యంగానే  చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: