పదేళ్ల తర్వాత మరో వై.ఎస్. ముఖ్యమంత్రి అయ్యాడు. తొమ్మిదేళ్ల పోరాటం తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాడు.. అదేం విచిత్రమో ఏమో కానీ.. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదే కృష్ణమ్మ ఉప్పొంగింది. గత పదేళ్లలో కృష్ణానదికి ఇంత వరద ఎప్పుడూ రాలేదు. పదేళ్లుగా శ్రీశైలం పూర్తిగా నిండలేదు.. నాగార్జున సాగర్ నిండే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది.


అటు రైతు కూడా ఆనందంతో మురుస్తున్నాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు తగ్గింది. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 17.54 లక్షల హెక్టార్లకు పెరిగింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరి నాట్లు పుంజుకున్నాయి. గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలు మినహా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నాట్లు జోరుగా పడుతున్నాయి.


విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాధారిత పంటలతోపాటు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ వరి నాట్లు ప్రారంభించారు. అయితే రాయలసీమ జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నాయి. నాలుగు రాయలసీమ జిల్లాలుసహా మొత్తం ఏడు జిల్లాలు బుధవారానికి 20 శాతం నుంచి 50 శాతం వరకు లోటు వర్షపాతంలో ఉన్నాయి. విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సాధారణ స్థితిలో ఉండగా శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి.


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోనూ పరిస్థితి మెరుగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే పంటల సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని చేరుతుందని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే నీరు రావడం ప్రారంభమైంది. ఈసారి శ్రీశైలం, సాగర్‌లు నిండేందుకు ఆస్కారం కనిపిస్తున్నందున సాగర్‌ కుడికాలువకు నీరిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో రైతన్న ముఖంలో చాలా రోజుల తర్వాత వికసిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: