నిన్న మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరువు మేఘాలు. ఎండా కాలం పోయినా తగ్గని ఎండలు.. ఈ ఏడాది కూడా పంటలు పండవేమో.. కరువు కాలం తప్పదేమో అన్న బెంగ.. కానీ కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో సస్యాంధ్రప్రదేశ్ గా మారబోతోంది.


వ్యవసాయశాఖ వెలువరించిన గణాంకాలు ఇదే చెబుతున్నాయి. గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉంటే ఇప్పుడది 19 శాతానికి తగ్గిపోయింది. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మొత్తంగా 556 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికి 275.4 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే 224.1 మిల్లీమీటర్లే కురిసింది. అయితే గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగైంది.


వర్షపాతం లోటు ప్రస్తుతం 19 శాతానికి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం సైతం పెరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం లక్ష్యం 38.30 లక్షల హెక్టార్లుగా ఖరారు చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఇప్పటికి 22.17 లక్షల హెక్టార్లు అంటే సుమారు 79 శాతం విస్తీర్ణంలో పంటలు వేసి ఉండాల్సింది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు 17.74 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో ఎక్కువగా జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు వరి ఉంది.


మొక్కజొన్న, రాగి, కంది, పత్తి, చెరకు వంటి పంటలైతే 75 శాతం వరకు వేసినట్టు వ్యవసాయ శాఖ లెక్కలేసింది. ఈ సీజన్‌లో ఇప్పటికి 7.44 లక్షల హెక్టార్లలో వరినాట్లు పడాల్సి ఉండగా.. 6.33 లక్షల హెక్టార్లలో వేశారు. ఖరీఫ్‌లో మొత్తంగా 15.19 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేయాలన్నది లక్ష్యం. ఇదిలా ఉంటే.. గోదావరి వరదలతో నీట మునిగి దెబ్బతిన్న వరి నారు మళ్లు తిరిగి పోసుకునేందుకు వీలుగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: