కాంగ్రెస్ ర‌థ‌సార‌థులు అయిన గాంధీ కుటుంబానికి వీర విధేయం ...అదే స‌మ‌యంలో స్వ‌ప‌క్షంలో విప‌క్షం..నిత్యం అస‌మ్మ‌తి గ‌ళం...దీనికి కొన‌సాగింపుగా ఏకంగా....పార్టీ ఖేల్ ఖ‌తం అని ప్ర‌క‌టించే అంత అస‌హ‌నం...ఇది స్థూలంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత రావు ప‌రిచ‌య వాక్యాలు. తాజాగా వీహెచ్ మ‌రింత సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొంద‌రు ముఖ్య నేతల వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని వాఖ్యానించారు. పార్టీలోని నిజాయితీ పరులకు అన్యాయం జరుగుతుందని ముఖ్యంగా రాజీవ్ గాంధీ అభిమానులకు అవమానం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

తనను ఖమ్మం స్థానానికి పోటీచేయకుం డా పీసీసీ చీఫ్ ఉత్తమ్, భట్టివిక్రమార్క అడ్డుకున్నారని వీహెచ్‌ ఆరోపించారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ అడిగితే ఏఐసీసీ కార్యదర్శి డబ్బులు అడిగారని ఆరోపించారు. అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వంపై చర్యలు తీసుకోవడంలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పదవులిస్తే పార్టీని వీడేందుకు వెనుకాడనని స్పష్టంచేశారు. తెలంగాణలో కాం గ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సోనియాకు ఫిర్యాదుచేసినట్టు తెలిపారు. ఈ నెల 20న జరగబోయే రాజీవ్ గాంధీ జయంతి రోజు తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని వీహెచ్ ప్రటించారు . దీనిపై పార్టీ నేతలపై మరియు కార్యకర్తలతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

 కాగా,పార్టీ పట్ల అమితమైన విధేయుడైన వీహెచ్‌కు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ద‌క్కింది. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న పార్టీ ప‌ట్ల అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మళ్లీ కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం లేదని నిర్ణయానికి వచ్చిన వీహెచ్ పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆయ‌న త‌న‌దారి తాను చూసుకునేందుకు ప్రాథ‌మిక చ‌ర్య‌గా తాజా క‌ల‌కలం రేపే కామెంట్ల‌ని విశ్లేషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: