మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి అధికారులు పెద్ద షాకే ఇచ్చారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో ఉన్న మోటారు వాహనాల షో రూములను మూయించేశారు. గడచిన ఐదేళ్ళుగా టూ వీలర్లు అమ్ముతున్నప్పటికి కట్టాల్సిన పన్నులను మాత్రం ఎగొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అందుకనే శనివారం అకస్మాత్తుగా దాడులు చేసిన అధికారులు రెండు షో రూములను మూయించేశారు.

 

గడచిన ఐదేళ్ళుగా స్పీకర్ గా తండ్రికున్న అధికారాలను అడ్డం పెట్టుకుని కొడుకు శివరామ్, కూతులు విజయలక్ష్మిలు అరాచకాలకు పాల్పడ్డారు. విచిత్రమేమిటంటే ఇద్దరు చెరో నియోజకవర్గాన్ని పంచేసుకున్నారు. తమ దందాలకు, అరాచకాలకు, వసూళ్ళకు ఇబ్బంది లేకుండా ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఒప్పందం కుదుర్చుకున్నట్లే ఉంది వాళ్ళ వ్యవహారం.

 

అంటే అరాచకాల్లో కూడా ఎంత పద్దతిగా వ్యవహరించారో అర్ధమైపోతోంది. వీళ్ళకు కోడెల మద్దతు పూర్తిస్ధాయిలో ఉంది కాబట్టే సంతానం అంత స్ధాయిలో నియోజకవర్గాలను దోచేసుకున్నారు. దోచుకోవటంలో తన మన అన్న తేడా లేకుండా అందరి దగ్గర సమన్యాయం పాటించారు. సమన్యాయంలో భాగంగా చివరకు పార్టీ నేతలను కూడా వదలకుండా పట్టి పీడించి మరీ పిప్పి చేసేశారు.

 

ఐదేళ్ళ అరాచకాల ఫలితమే ఇపుడు అనుభవిస్తున్నారు. కొడుకు, కూతురుపై సుమారుగా 20 కేసులు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు కూడా జారీ అయ్యింది. దాంతో ఇద్దరు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలివ్వాలని కోర్టును అడిగినా కుదరలేదు.

 

ఇటువంటి పరిస్ధితుల్లో అసలు వీళ్ళద్దరూ నియోజకవర్గంలోనే ఉన్నారా లేదా అన్న అనుమానాలున్నాయి. ఎందుకంటే ఇద్దరు ఇపుడు ఎవరికి కనబడటం లేదని ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా కోడెల మాత్రం తన సంతానం అమాయకులని, వాళ్ళపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ వాదిస్తుండటమే విచిత్రంగా ఉంది. మొత్తానికి వాళ్ళ పాపాలు పండి అరాచకాలు ఒక్కోటే బయట పడుతున్నాయి. షో రూముల మూయించేయటం కూడా ఇందులో భాగమే.


మరింత సమాచారం తెలుసుకోండి: