డబ్బు కోసం ఈ మద్య దేవుడి గుళ్లను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది కేటగాళ్లు. ప్రముఖ పుణ్యక్షేత్రాల చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్వీకులు గుప్తనిధులు దాచి ఉంచారని ఇప్పటికీ కొంత మంది నమ్ముతుంటారు.  అయితే కొన్ని సార్లు  తవ్వకాల్లో నిధులు కూడా బయట పడుతున్నాయి. దాంతో కొన్ని పురాతన ఆలయాల్లో ఇప్పటికీ దుండగులు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు.  మరో దారుణమైన విషయం ఏంటంటే..ఇలాంటి గుప్త నిధుల తవ్వకాల కోసం నర బలులు కూడా ఇస్తున్నారు.  ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 

తాజాగా గుప్త నిధుల కోసం మూడు శతాబ్దాల నాటి శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఒకే సారి 101 శివాలయాలను నిర్మించి అందులో ఒకే సమయంలో 101 శివలింగాలను ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. వాటిలో రామలింగేశ్వరస్వామి ఆలయం ఒకటిగా చరిత్రకారులు చెబుతున్నారు. 

ఈ ప్రాచీన శివాలయంలో గుప్త నిధులు ఉన్నట్టు భావించిన దుండగులు తవ్వకాలు జరిపారు. ఓ స్తంభాన్ని, శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.  అనుమతులు లేకుండా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లడం గానీ, పరిసరాల్లో సంచరించడంగానీ నేరంగా అక్కడక్కడా బోర్డులు ఉంచారు. ఇది జరిగి సుమారు 15 సంవత్సరాల పైనే అయింది. కానీ దుండగులు అప్పటి నుంచి రక రకాలుగా ఇక్కడ తవ్వకాలు జరపడానికి ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. 

ఈ ఆలయంలో గతంలోనూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు ఆలయ పూజారి తెలిపారు. ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించి భక్తులు ఎంతో పవిత్రంగా పూజించే దేవతల విగ్రహాలను కూల్చడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పూజారి ఆమంచి రవికుమార్‌ ఫిర్యాదు మేరకు పురావస్తుశాఖ కన్జర్వేటివ్‌ అసిస్టెంట్‌ వెంకటయ్య, అచ్చంపేట ఎస్‌ఐ పి.పట్టాభిరామయ్య శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: