దేశం మొత్తానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతలకు ఎంత చేసినా తక్కువే. అందుకనే నరేంద్రమోడి రెండోసారి మంచి మెజారిటితో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఓ తీపి కబురు చెప్పారు. రైతులకు కూడా ప్రతీ నెల పెన్షన్ ఇచ్చే ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. కొత్త పథకం ప్రకారం 60 సంవత్సరాలు దాటిని ప్రతీ రైతుకు నెలకు 3 వేల రూపాయల పెన్షన్ వస్తుంది.

 

ఇంతకీ పెన్షన్ పథకం వివరాలు ఏమిటంటే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనా (పిఎంకెఎంవై) పథకాన్ని శుక్రవారం నుండే కొత్తగా ప్రారంభించారు.  ఈ పథకంలో చేరదలుచుకున్న రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. వాలంటరీ కంట్రిబ్యూటరీ ఆధారిత  స్కీం పద్దతిలో అమలవుతుంది.

 

ఈ పథకంలో చేరదలచుకున్న రైతులకు కనీస వయసు 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ళ లోపుండవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లలో తమ వివరాలను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.  పథకంలో  సభ్యులుగా  చేరిన రైతులు ప్రతీనెల 55 రూపాయల నుండి 200 రూపాయల వరకూ చెల్లించాల్సుంటుంది.

 

అంటే రైతులు వయసు పెరిగేకొద్దీ చెల్లించే మొత్తం మారుతుంటుంది. రైతులు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని పెన్షన్ ఫండ్ కు జమచేస్తుంది. రైతు కుటుంబంలో ఎంతమందుంటే అంతమందీ పెన్షన్ పథకంలో సభ్యులుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

 

రిజస్టర్ చేసుకున్న వారు ఎంతమందైనా అంతమందికి విడివిడిగానే పెన్షన్ చెల్లిస్తుంది కేంద్రప్రభుత్వం.  ఈ పథకంలో సభ్యులు 60 ఏళ్ళ రిటైర్మెంటుకు ముందుగానే మరణిస్తే అప్పటి వరకూ వాళ్ళు చెల్లించిన మొత్తానికి వడ్డీ కూడా కలిపి చెల్లించేస్తారు. రిజిస్ట్రేషన్  సమయంలోనే నామినిగా పేర్కొన్న వారికి మాత్రమే వచ్చే మొత్తాన్ని చెల్లిస్తారు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ పెన్షన్ ఫండ్ ఈ పథకాన్ని నిర్వహిస్తుంది. మొత్తానికి రైతులకు కూడా పెన్షన్ చెల్లించాలన్న మోడి ఆలోచనను అభినందించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: