తెలంగాణ లో అధికార టీఆరెస్ ను ఇరకాటం లో పెట్టేందుకు బీజేపీ నాయకత్వం పక్కాగా పథక రచన చేస్తోంది . విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించక పోవడాన్ని తెలంగాణ ఉద్యమకారులు ,  ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు . ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ నాయకత్వం ప్రజల్లో సెంటిమెంట్ ను రగల్చడం ద్వారా రాజకీయంగా తమకు అనుకూలంగా మల్చుకోవాలని భావిస్తోంది . తెలంగాణ ఉద్యమ సమయం లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ , తాను అధికారం లోకి రాగానే మాట మార్చిన విషయం తెల్సిందే .


 గతం లో అధికారం లో ఉన్న పాలకులు  విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని , తాము కూడా నిర్వహించబోమని ముఖ్యమంత్రి హోదా లో  కేసీఆర్ స్పష్టం చేశారు .  తాము పార్టీ పరంగా మాత్రమే విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు  కేసీఆర్ . మజ్లిస్ ఒత్తిడి కారణంగానే   టీఆరెస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా  నిర్వహించడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది  . విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోన్న  బీజేపీ జాతీయ నాయకత్వం , ఈ మేరకు రాష్ట్ర నేతలకు మార్గ నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది .


తెలంగాణ  విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న రాష్ట్రం లో భారీ బహిరంగ  సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది . ఈ సభకు  బీజేపీ జాతీయాధ్యక్షుడు  అమిత్‌షా హాజరుకానున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి .  ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ లో  బీజేపీ నాలుగు స్థానాలు గెల్చుకున్న తరువాత అమిత్ షా , రాష్ట్రం పై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ లో సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయిన అమిత్ షా , రాష్ట్రం లోనే సభ్యత్వాన్ని తీసుకోవడం ద్వారా , తమకు తెలంగాణ ఎంత ప్రత్యేకమో చెప్పకనే చెప్పాలని డిసైడ్ అయ్యారు


మరింత సమాచారం తెలుసుకోండి: