అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానం తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ  తరుణంలో  ఆ పార్టీ జార్ఖండ్ చీఫ్ అజోయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని, స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి మూడు పేజీల రాజీనామా లేఖను పంపినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు స్వప్రయోజనాల కోసం తమ ఆలోచనలను పార్టీపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిని తాను అస్సలు సహించబోనని, అది ఏ రూపంలో ఉన్నా తాను అడ్డుకుంటానని స్పష్టం చేశారు.



ఇది తన పదవికి అడ్డంకిగా మారిందని, కాబట్టి దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో కోరారు. ఇదిలా ఉండగా సుదీర్ఘ చర్చలు, బుజ్జగింపులు, అనేక తర్జన భర్జనల అనంతరం తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నియమితులయ్యారు. ఈ విషయంలో సీడబ్ల్యూసీ సుదీర్ఘ మంతనాలు జరిపింది. ఈ చర్చలో మరోసారి రాహుల్‌ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. అయితే రాహుల్‌ మరోసారి సున్నితంగా తిరస్కరించారు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై సీడబ్ల్యూసీ మల్లగుల్లాలు పడింది. సుదీర్ఘ భేటి అనంతరం సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగించాలని చివరికి సీడబ్ల్యూసీ నిర్ణయించింది. త్వరలో మరోసారి సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.



కాగా కాంగ్రెస్ కొత్త బాస్ కోసం సుదీర్ఘ కసరత్తే జరిగిందని చెప్పాలి. సారథి ఎంపిక కోసం సీడబ్ల్యూసీ ఐదు కమిటీలుగా విడిపోవడం గమనార్హం. ఈ ఐదు కమిటీలు వేరువేరుగా వివిధ ప్రాంతాలకు చెందిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రతినిధులతో ప్రియాంక గాంధీ. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో మన్మోహన్ సింగ్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల నేతలతో అంబికా సోనీ సంప్రదింపులు జరుపుతున్నారు. వాయనాడ్ పర్యటన కారణంగా రాహుల్ గాంధీ సమావేశం నుంచి బయటకు వచ్చేసారు. చర్చల అనంతరం సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చిన సీడబ్ల్యూసీ గత్యంతరం లేక మళ్ళీ సోనియా గాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించి చేతులు దులుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: