కేంద్రం సంచ‌ల‌న రీతిలో జ‌మ్మూక‌శ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ప‌రిస్థితులు మారుతున్నాయి. ఆర్టిక‌ల్ ర‌ద్దు విష‌యంలో ఆ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెక్షన్‌ 144 కింద విధించిన ఆంక్షలను జమ్ము ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కశ్మీర్‌ లోయలో శాంతియుత వాతావరణం నెలకొన్నదని, ప్రజల రాకపోకలు కూడా కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కార్గిల్‌ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, బక్రీద్‌ నేపథ్యంలో ప్రజలు షాపింగ్‌ చేయడంతో సందడి నెలకొందని చెప్పారు. శ్రీనగర్‌లోనూ మార్కెట్లు తెరుచు కోవడంతో ప్రజలు తమకు కావాల్సిన వస్తు వులను కొనుగోలు చేశారని అధికారులు పేర్కొన్నారు. 


ఫూంచ్‌, రాజౌరీ, రాంబాన్‌ జిల్లాల్లో మాత్రం ఇంకా ఆంక్షలు కొనసాగుతుండ‌గా... దోడా, కిష్టార్‌ జిల్లాల్లో కర్ఫ్యూను సడలించింది. జమ్ము రీజియన్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం కూడా పెరిగింది. సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘జమ్ము, కతువా, సాంబా, ఉద్ధంపూర్‌, రేసి జిల్లాల్లో అమల్లో ఉన్న ఆంక్షలను ఎత్తివేశాం. ఈ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు శనివారం తెరుచుకున్నాయి’ అని తెలిపారు. ఆంక్షలు అమల్లోకి వచ్చిన ఈ నెల 5 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదని, ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతున్నదని చెప్పారు. దుకాణాలు, కూరగాయల మార్కెట్లు కూడా తెరుచుకున్నాయని, ప్రజల రాకపోకలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 


మ‌రోవైపు ఆర్టికల్‌ 370ను రద్దు చేసినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో క్యాంప్‌ వేసిన  జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లో అజిత్‌ దోవల్‌ ప్రధానంగా ఉగ్రవాద ప్రభావిత జిల్లాల్లో ఎక్కువగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను సేకరించడమే కాకుండా వారిలో మనోధైర్యాన్ని నూరిపోయడానికి ప్రయత్నిస్తున్నారు.  ఆదివారం ఆయన అనంత్‌నాగ్‌ జిల్లాలో పశువుల విక్రేతలు, స్థానికులతో మాట్లాడారు. గొర్రెలను ఎంతకు అమ్ముతుంటారని, వాటికి ఎలాంటి మేత పెడుతుంటారని విక్రేతలను అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి అజిత్‌ దోవల్‌ వారిలో ఒకరిలా కలిసిపోయి బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: