కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వాడేసిన వంటనూనెను బయోడీజిల్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వంటల కోసం నూనెను ఓసారి వేడి చేసిన తర్వాత... దాన్ని రెండోసారి వేడి చేసి వాడటం ఆరోగ్యానికి హానికరం. అందువల్ల ఒకసారి వంట కోసం వాడిన నూనెలో మిగిలిపోతున్నదాన్ని బయో డీజిల్‌గా మార్చేందుకు చమురు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఉపయోగించిన వంట నూనెను అమ్మేందుకు మొబైల్ యాప్ తెచ్చారు. హోటళ్ళు, రెస్టారెంట్లు దీని ద్వారా బయోడీజిల్ తయారీకి వాడే వంట నూనెను సరఫరా చేయవచ్చు. ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)లు ఆసక్తిగల ప్రైవేట్ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. 


ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం పేరుతో వంద నగరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఆగస్ట్ 10న ఈ కొనుగోలు కార్యక్రమం మొదలైంది. ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకే ఈ ప్రక్రియ. కాగా, మొదటి సంవత్సరం లీటర్‌కు రూ.51 చొప్పున, రెండో సంవత్సరం రూ.52.7, మూడో సంవత్సరం రూ.54.5 చొప్పున ఉత్పాదక సంస్థల నుంచి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు బయోడీజిల్‌ను కొనుగోలు చేయనున్నాయి. ఈ నిర్ణ‌యంతో ఇటు క‌ల్తీ నూనెతో ఆరోగ్యాలు చెడిపోవడం, అటు బ‌యోడీజిల్ అవ‌స‌రాలు తీర‌డం తీర‌నున్నాయ‌ని అంటున్నారు.


ప్రస్తుతం మనదేశంలో ప్రతి నెలా 850 కోట్ల లీటర్ల డీజిల్‌‌ ఖర్చవుతోంది. 2030 నాటికి డీజిల్‌‌లో ఐదుశాతం బయోడీజిల్‌‌ను కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఏటా 500 కోట్ల లీటర్ల బయోడీజిల్‌‌ అవసరం. దేశవ్యాప్తంగా ఏటా 2,700 కోట్ల లీటర్ల వంటనూనెను వాడుతుండగా, ఇందులో 140 కోట్ల లీటర్లు యూసీఓగా మారుతుంది. హోటళ్ల నుంచి, రెస్టారెంట్ల నుంచి, క్యాంటీన్ల నుంచి దీనిని తీసుకుంటే, ఏటా 110 కోట్ల లీటర్ల బయోడీజిల్‌‌ తయారు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: