నూతన అసెంబ్లీ, సచివాలయ  నిర్మాణం పై టీ- బీజేపీ నేతలు  ద్వంధ  వైఖరి అవలంభిస్తున్నారని   టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు  .  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నూతన అసెంబ్లీ భవనం నిర్మించవచ్చు...  కానీ తెలంగాణలో  నూతన అసెంబ్లీ , సచివాలయ  భవనాలను నిర్మిస్తామంటే బీజేపీ నేతలు తప్పుపడుతూ రాద్ధాంతం చేయడం పట్ల గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు . గుజరాత్ లో ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీ భవనాన్ని ఆధునీకరించారని తరుచూ ప్రస్తావిస్తోన్న టీఆరెస్ నేతలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మంచి అస్త్రాన్ని అందించారు .


 ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని ఆధునీకరించాలని లేదంటే ,  నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన ఉందని  లోక్ సభ  స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలను,  టిఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు .  పార్లమెంటుకు నూతన భవనం అవసరమైనప్పుడు,  అసెంబ్లీకి నూతన భవనం ఎందుకు అవసరం లేదు అంటూ వారు  ప్రశ్నిస్తున్నారు.  తెలంగాణలో నూతన అసెంబ్లీ , సచివాలయ భవన నిర్మాణాలను  బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.  కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో భావి తరాల కోసం నూతన అసెంబ్లీ , సచివాలయ భవనాలను  నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.  ఈ మేరకు చకచకా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.


  అయితే విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయంటూ  టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.  అసెంబ్లీ సెక్రటేరియట్ నిర్మాణాలపై ఇప్పటికే కోర్టులో వ్యాజ్యం నడుస్తున్న నేపథ్యంలో బిజెపి నాయకత్వం అనుసరిస్తున్న ద్వంధ  వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.నూతన అసెంబ్లీ , సచివాలయ భవనాల నిర్మాణాన్ని బీజేపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: