వినేవాడు వెంగలప్ప అయితే.. చెప్పేవాడు చిరంజీవి!- అని ఇప్పటికీ పల్లెటూరులో చెప్పుకుంటూ ఉంటారు. అచ్చు ఇలానే వ్యవహరిస్తున్నాడు మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. పరీక్షలప్పుడు పాఠం గుర్తులేదన్నట్టుగా...  ఎన్నికల సమయంలో తప్పుల కుప్పలు వ‌ల్లెవేసిన‌ ఆయన ఇప్పుడు మాత్రం భారత, భాగవతాలు కూడా వ‌ల్లెవేస్తానని అనేస్తున్నారు. దీంతో విస్తుపోవడం అందరివంతవుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంగళగిరిని మంద‌ల‌గిరి చేసిన లోకేష్ ఇప్పుడు మాత్రం నీతిసూత్రాలు వ‌ల్లెవేస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి పాతపాఠాలు నేర్పిస్తానంటున్నారు. 


గడిచిన నెల రోజులుగా కొంత దూకుడుగా ఉన్న ఈ మాజీ సీఎం కుమారుడు ఇప్పుడు ఏకంగా జగమంత కుటుంబాన్ని సొంతం చేసుకున్న జగన్‌కే పాఠాలు చెప్పేందుకు రెడీ అయ్యారు. మ‌రి విషయంలోకి వెళ్తే.. తాజాగా ఏపీలో కొత్త ప్రభుత్వం విదేశాల నుంచి పెట్టుబడులను తెచ్చుకునేందుకు, పరిశ్రమలు గ‌ట్రా ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే దౌత్యవేత్తలు సదస్సును ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 35 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు బారులు క‌ట్టి మరీ ఏపీకి వచ్చారు. వీరంతా ఇక్కడ పెట్టుబడులకు సిద్ధమయ్యారు. అయితే, ఏపీ పరిస్థితి ఏంటి? ఇక్కడ పెడితే.. ఏం జరుగుతుంది? అనేది పెట్టుబడి పెట్టేవాడి సందేహం. 


మరి ఇక్కడ నిజంగానే ఉన్నపరిస్థితి ఏంటి! అనే విషయంలో మనం దాగుడు మూతలు ఆడినా.. నిజాలు నెమ్మదిగా అయినా తెలియకపోవు. పెట్టుబడి పెట్టేవాడు తెలుసుకోకుండానే ఉండడు. అందుకే ఎందుకొచ్చిన గొడవని అన్నీ నిజాలే చెబుతాను అన్నట్టుగా సీఎం జగన్.. వచ్చిన మన గురించి అన్నీ నిజాలే చెప్పారు. ఇదే.. ఇప్పుడు చంద్రన్న గారి చిన్నబాబుకు త‌ల‌కొట్టేసిన‌ట్టయింది. అంబలి తాగుతున్నా మీసాలకు సంపెంగ నూనె రాసుకోవాలని ఆయన చెప్పుకొస్తున్నారు. అప్పులు చేసైనా సరే పప్పుకూడు తింటున్నామని ఘ‌నంగా చాటింపు వేసుకోవాలని తమ పాలన గురించి ఉదహరిస్తున్నారు. అంతేనా.. మా అంత వాడు లేరు.. ఉంటే.. ఇక్కడకు రాడు! అంటూ.. బాజాభ‌యించాల‌ని కూడా బాబుగోరుమ‌హ‌బాగుగా సెల‌విస్తున్నారు. 


రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఉన్నట్టు చెప్పి త‌ప్పు చేశావంటూ.. జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగి, కారాలు మిరియాలు.. తమ్ముళ్ల‌తో కలసి మరీ నూరుతున్నారు. తమ హయాంలో పెట్టుబడి దారులకు తాము చూపించిన సినిమాలను మరోసారి తెరమీదకు తెస్తున్నారు. ఇలా చేయలేక పోతున్నావంటూ.. జగన్ పై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం చిన్నబాబు గారి చిత్రమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే.. ఇలా.. వాపుల‌ను  ఖండాలుగా చూపించుకుని విశాఖలో గత ఐదేళ్ల పాలనలో నిర్వహించిన సదస్సులో కోట్లకు కోట్లు క‌ర‌గ‌బెట్టి ఒక్క చిన్న బ‌డ్డీ కొట్టును కూడా పెట్టించ‌లేక‌పోయారు. అంటున్నారు నెటిజన్లు!!



మరింత సమాచారం తెలుసుకోండి: