ఆయన కళా తపస్వి, మహా యశ్వసి, తెలుగు సినిమా కీర్తిని దిగంతాలకు అవతల  వరకూ చాటిన ఘనత ఆయనది. కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు జాతికి గర్వకారణం. తెలుగు సినిమాకు ఆయన అధ్బుతం. ఓ శంకరాభరణం చాలు,  తెలుగు జాతి జన్మ జన్మలకు ఆయనకు రుణపడిఉండడానికి. ఓ సిరిసిరిమువ్వ చాలు ఆయనలోని మేటి దర్శకుడిని గురించి చెప్పడానికి. ఓ సీత కధ చాలు. విశ్వనాధుని అభ్యుద‌యాన్ని అందరికీ చెప్పేందుకు.


అటువంటి కళాతపస్వి ఇంటికి ఈ రోజు ఓ గొప్ప అతిథి వచ్చారు. ఆయనెవరో కాదు తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, విశ్వనాధ్ ఇంటికి వెళ్ళిన కేసీయార్ ఆయనతో ముచ్చటించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  కళారాధనలో నిజానికి కేసీయార్ కూడా తక్కువేం కాదు, తెలుగు భాషను అద్భుతంగా పలికించగల దిట్ట. కళలంటే ఆయనకు ఎంతో అభిమానం. అచ్చ తెలుగు భాషతో పాటు తెలంగాణా నుడికారం ఆయనకు ఎంతో ఇష్టం.


మరి ఈ ఇద్దరూ కలసిన  సన్నివేశం అరుదైనదిగానే  చెప్పాలి. కేసీయార్ తన ఇంటికి రావడం పట్ల విశ్వనాధ్ ఓ విధంగా షాక్ తిన్నారనే చెప్పాలి. కేసీయార్ రాక తనకు ఎంతో ఆనందాన్ని  ఇచ్చిందని విశ్వనాధ్ చెప్పారు. ఇక సీఎం  కేసీయార్ విశ్వనాధ్ ని మర్యాదపూర్వకంగా కలిశారని, విశ్వనాధ్ ఆరోగ్యంగా ఉన్నరని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలియచేశాయి.


ఇదిలా ఉండగా విశ్వనాధ్ అంతటి గొప్ప దర్శకుడు కేవలం పద్మశ్రీ వద్దనే ఆగిపోయారు. ఆయనకు రావాల్సిన బిరుదులు ఎక్కాల్సిన ఎత్తులు ఎన్నో వున్నాయి. కళాఖండం అంటే అది విశ్వనాధ్ దేనని చెప్పుకోవడం సహజమైన పరిణామం. అంతటి కీర్తిమంతుడుకి వరించాల్సిన అవార్డులు  ఇంకా రాలేదు. మరి ముఖ్యమంత్రి ఆయన్ని స్వయంగా కలసిన వేళ రాబోయే రోజులో పద్మ భూషణుడిగానో, విభూషణుడిగానే విశ్వనాధ్ ని మనం చూసే అవకాశం ఉందా అని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: