దేశమంటే కేవలం భౌగోళిక చిత్రం కాదని, దేశంలోని కోట్లాది మంది ప్రజల సమ్మిళిత అభివృద్ధి ముఖచిత్రం కావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.  ఉపరాష్ట్రపతిగా రెండేళ్ళ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా రూపొందిన లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్ పుస్తకాన్ని చెన్నైలోని కలైవనర్ ఆరంగంలో కేంద్ర హోంశాఖ మాత్యులు  అమిత్ షా ఆవిష్కరించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ దేవకర్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. రాజకీయాలు, పరిపాలన, చట్టాల విషయంలో తన అభిప్రాయాలను పంచుకున్న ఉపరాష్ట్రపతి, రాజకీయ వ్యవస్థలో సానుకూల మార్పు అవసరమని, దీని కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులకు పార్టీలు ప్రవర్తన నియమావళి ఏర్పాటు చేసి ఎన్నికల ప్రణాళిక పత్రంలో పొందుపరచాలన్న ఉపరాష్ట్రపతి, పరిపాలనా సంస్కరణ వేగం మరింత పెరగాల్సి ఉందన్నారు. ఇంకా అక్కడక్కడ పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక వివక్ష, లింగ వివక్ష లాంటి సమస్యలు కనబడుతూనే ఉన్నాయని, వీటికి పూర్తిగా పరిష్కారం కనుగొన్న నాడే స్వర్ణ భారతం సాకారమవుతుందని, సమ్మిళిత అభివృద్ధి ద్వారానే ఇది సాధ్యమౌతుందని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా స్థానిక సంస్థలకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందని, చట్టసభల పనితీరు మెరుగు పడాలని ఆకాంక్షించిన ఉపరాష్ట్రపతి, పరిపాలన సంస్కరణలు చేపట్టి  ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు నేరుగా చేరేటట్టు చూడడం అత్యంత ఆవశ్యకమని  తెలిపారు.



సామాన్యునికి త్వరితగతిన న్యాయం అందించే దిశగా న్యాయవ్యవస్థలోనూ మార్పులు అవసరమని, తీర్పుల వేగాన్ని మరింత పెంచే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సుప్రీం కోర్టు నాలుగు బెంచ్ లు ఏర్పాటు చేయాలని, ప్రయోగ ప్రాతిపదికన అదనపు బెంచ్ ను చెన్నైలో ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి తెలిపారు. 25, 30 ఏళ్ళుగా సివిల్, క్రిమినల్ కేసులు సుప్రీం లో పెండింగ్ లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో జడ్జి ల సంఖ్య పెంచడం, దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు బెంచ్ లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగ పరమైన అప్పీళ్ళు సుప్రీం కేంద్ర కోర్టుకు రావాలని, ఇతర అప్పీళ్ళకు ప్రాంతీయ ఉన్నత న్యాయస్థానాల్లో తీర్పులు రావాలని ఉపరాష్ట్రపతి అభిలషించారు. ఈ మూడు అంశాల విషయంలో క్షేత్ర స్థాయిలో సమస్యలు ఉన్నప్పటికీ, ప్రజలందరి భాగస్వామ్యం ద్వారా సానుకూలమైన పరిష్కరాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.



ప్రజా జీవితంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు మరింత దగ్గరగా ఉన్నానని, ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని, అదే ప్రజలకు తనను మరింత చేరువ చేసిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు ఢిల్లీలో నిర్వహిస్తుంటారని అయితే, దేశమంతా ఒక్కటే అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెన్నైలో ఏర్పాటు చేయమన్నానని తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని వ్యక్తిగత విషయాలను సైతం పంచుకున్న ఉపరాష్ట్రపతి తాను రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉన్నానని, ప్రజలకు మాత్రం దగ్గరగా ఉండేందుకు మరింత ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఇందు కోసం తాను ఉపరాష్ట్రపతి అయ్యాక ప్రోటోకాల్ విషయంలో చాలా సడలింపులు చేశానని తెలిపారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాగుతున్న తన పర్యటనలను విజ్ఞాన సముపార్జన యాత్రలుగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు.రాజకీయాల్లో కొనసాగుతూనే 2020 తర్వాత నానాజీ దేశ్ ముఖ్ బాటలో సామాజికలో సేవలో గడుపుదామనుకున్నానని, ఈ విషయాన్ని మోదీజీకి చాలా సార్లు తెలిపానని, అయితే ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాలని మాత్రం ఏ రోజూ అనుకోలేదని, ఇది అనూహ్యంగానే జరిగిందని తెలిపారు. అయితే ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి వ్యక్తికి దేశంలో రెండో అత్యున్నత పదవి లభించడం, భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు.



ఉపరాష్ట్రపతి ఏడాది ప్రస్థానాన్నికి సంబంధించి మూవింగ్ ఆన్ – మూవింగ్ ఫార్వర్డ్ పేరిట సచిత్ర గ్రంథాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ గతేడాది విడుదల చేసిన విషయం విదితమే. చరైవేతి.. చరైవేతి... అనే ఉపనిషత్ వాక్యాల స్ఫూర్తితో ఈ పుస్తకాన్ని మొదటి ఏడాది కార్యక్రమాల సంకలనంగా రూపొందించారు. ఇప్పుడు ఆలకించడం, అధ్యయనం చేయడం, నేతృత్వం వహించడమనే నేపథ్యంలో సాగిన ఉపరాష్ట్రపతి రెండేళ్ళ ప్రయాణాన్ని ఇందులో వివరించారు. రెండేళ్ళలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్న 330 కీలకమైన కార్యక్రమాల విశేషాలతో ఈ పుస్తకాన్ని రూపు దిద్దారని చెప్పారు. విశాల భారతంలో విస్తారంగా పర్యటించిన ఉపరాష్ట్రపతి ఆయన రెండేళ్ళలో 61 స్నాతకోత్సవాల్లో ప్రసంగించారు, 35 కార్యక్రమాల్లో విద్యార్థులతో సమావేశమయ్యారు, 97 శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థలను సందర్శించారు. అంతే కాదు 25 ప్రత్యేక స్మారక ప్రసంగాలు చేశారు. పనామా, గ్వాటెమాల, కోస్టారికా, మాల్టా లాంటి దేశాలను సందర్శించిన తొలి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే కావడం విశేషం.  ఈ పుస్తకంలో ఉపరాష్ట్రపతి 4 ఖండాల్లోని 19 దేశాల సందర్శనతో కూడిన దౌత్యపరమైన వివిధ కార్యక్రమాలకు చోటు కల్పించారు.



రాజ్యసభ ఛైర్మన్ గా ఉపరాష్ట్రపతి సాధించిన విజయాలు, రాజ్యసభ గొప్పతనాన్ని చాటేందుకు, సామర్థ్యాన్ని పెంచేందుకు ఆయన చేపట్టిన వివిధ ప్రత్యేకమైన కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలను సైతం ఈ పుస్తకం కళ్ళకు కడుతుంది. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్  భన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, ఇస్రో మాజీ ఛైర్మన్  కస్తూరి రంగన్, తమిళ సినీ నటుడు రజనీకాంత్, బాడ్మింటన్ కోచ్  పుల్లెల గోపీచంద్, తుగ్లక్ పత్రిక సంపాదకులు గురుమూర్తి, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్  ప్రతాప్ సి.రెడ్డి సహా దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన రాష్ట్రమంత్రులు, రాజకీయనాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. చెన్నై సహా తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ లు, న్యాయ వాదులు, వైద్యులు, వ్యాపార వేత్తలు, ఉపకులపతులు, విద్యార్థులు సహా సినిమా, క్రీడలతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: