ఫుడ్ డెలివ‌రీ సంస్థ జొమాటో గురించి తెలుసుకదా? ఇటీవ‌లి కాలంలో ఓ వివాదం కారణంగా జొమాటో వార్తల్లో నిలిచింది. ముస్లిం డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్‌ను హిందూ వ్యక్తి వద్దని చెప్పడంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వాన అయింది. అనంత‌రం వివాదం సద్దుమణిగింది. అయితే ఇప్పుడు జొమాటోకు తమ డెలివరీ బాయ్స్ రూపంలోనే మరొక షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. జొమాటో డెలివరీ బాయ్స్ సమ్మె బాట ప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.


ఫుడ్ డెలివ‌రీలో పాపుల‌ర్ అయిన జొమాటో దేశంలోని అనేక నగరాలతో పాటు ప్రముఖ పట్టణాల్లోనూ ఆన్‌లైన్ సేవ‌లు అందిస్తోంది. వినియోగ‌దారుల నుంచి ఫుడ్ ఆర్డర్లు తీసుకుని డెలివరీలు ఇచ్చేందుకు అనేక రెస్టారెంట్లతో జొమాటో భాగస్వామ్యం అయింది. అయితే, ఇటీవ‌లి సంద‌ర్భాల్లో ఈ విష‌యంలో కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఆన్‌లైన్‌లో వచ్చే ఆర్డర్లను డెలివరీ చేసే బాయ్స్‌లో అనేక మతాలకు చెందిన వారు సహ‌జంగానే ఉన్నారు. అయితే, కొన్ని రెస్టారెంట్లలో లభించే పలు ప్రత్యేకమైన వంటకాలను డెలివరీ చేయడం విష‌యంలో ఈ బాయ్స్‌కు ఇబ్బంది అవుతోంద‌ని స‌మాచారం. ఆయా వంట‌కాలు డెలివ‌రీ చేయ‌డం తమ మత విశ్వాసాలను దెబ్బ తీసినట్లు అవుతుందని చెప్పి జొమాటో డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట‌.


కేవ‌లం ఈ విష‌య‌మే కాకుండా తమకు అందుతున్న కమిషన్, మెడికల్, ఇతర సదుపాయాలు కూడా సరిగ్గా లభించడం లేదని బాయ్స్ వాపోతున్నారు. ఈ క్రమంలోనే త‌మ స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి జొమాటో డెలివరీ బాయ్స్ సమ్మెకు దిగుతారని తెలుస్తోంది. కాగా దీనిపై జొమాటో ఇంత వరకు స్పందించలేదు. కాగా, ఫుడ్ ల‌వ‌ర్స్  ఈవిష‌యాన్ని గ‌మ‌నించాల్సిందే. బ‌క్రీద్ సెల‌వు సంద‌ర్భంగా ఏదైనా ఫుడ్‌ను ఎంజాయ్ చేయాల‌నుకుంటే...వేరే ఆప్ష‌న్ ఎంచుకోవ‌డం ఉత్తమం


మరింత సమాచారం తెలుసుకోండి: