మొన్నటి వరకూ వర్షాలు లేవంటూ దేశంలో చాలా మంది బాధ పడ్డారు. ‘ఇంగ్లండ్ లో క్రికెట్ మ్యాచ్ లు జరగనీయకుండా పడుతున్నాయి.. కాస్త ఆ వర్షాలేవో ముంబైలో పడొచ్చు కదా’ బిగ్ బీ అమితాబ్ ఆమధ్య ట్విట్టర్ లో ఓ మెసేజ్ చేశారు. ఆయన కోరికను వరుణుడు కరుణించాడో ఏమో ముంబైలో ఇటివల పడ్డ వానలకు ఆ మహానగరం అల్లాడిపోయింది. ప్రస్తుతం గుజరాత్, ఏపీ, కర్ణాటక, కేరళ.. రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో ఇళ్లు, పొలాలు, ఊళ్లు, ముంపుకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 


గుజరాత్ లో వరదలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరదల్లో ఓ గ్రామంలో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను ఓ కానిస్టేబుల్ తన భుజాలకెక్కించుకుని, మోస్తూ దాదాపు ఒకటిన్నర కిలోమీటరు నడుములోతు నీళ్లలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి వారిద్దరినీ కాపాడాడు. అంత వరదలో దారి తెలీని పరిస్థితిలో, వరద తీవ్రతను తట్టుకుంటూ ఆ కానిస్టేబుల్ చూపిన ధైర్య సాహసాలకు మెచ్చుకోని వారు లేరు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు 200 కి.మీ దూరంలోని మోర్చీ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిందీ సంఘటన. వరదల్లో మునిగిపోయిన గ్రామంలో రక్షణ చర్యల్లో ఉన్న పృథ్వీరాజ్ సింగ్ జడేజా అనే కానిస్టేబుల్ ఇంత సాహసం చేసి శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఓ వ్యక్తి తీసిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆ కానిస్టేబుల్ సాహసం సాక్షాత్తూ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి కూడా వెళ్లింది.

 


పృథ్వీరాజ్ సింగ్ లాంటి పోలీసులు తమ ధైర్యసాహసాలతో, విధుల నిర్వర్తిస్తూ పోలీసులకే గర్వకారణంగా నిలుస్తున్నారని విజయ్ రూపాని ప్రశంసించారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా పృథ్వీరాజ్ ధైర్య సాహసాలను తన ట్విట్టర్ లో ప్రస్తావించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: