హైద‌రాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి తీపిక‌బురు. మ‌రో భారీ ఐటీ సెజ్ హైద‌రాబాద్‌కు రానుంది. మహతా ఇన్ఫర్మేషన్‌ ఇండియా సంస్థ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని నానక్‌రామ్‌గూడలో భారీ సెజ్ ఏర్పాటు చేయ‌నుంది. రూ.1,147 కోట్ల పెట్టుబడితో 7.172 ఎకరాల్లో దీనిని నెలకొల్ప‌నుంది. దాదాపు దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కొత్త ఐటీ సెజ్‌ ఏర్పాటు కాబోతుండ‌గా...ఈ కేంద్రం ద్వారా 12,870 మందికి ఉపాధి ద‌క్క‌నుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్ప‌టికే మ‌హ‌తా సంస్థ‌ దరఖాస్తు చేసుకుంది.


ఐటీ రంగంలో దేశ‌వ్యాప్తంగా త‌న ముద్ర‌ను చాటుకుంటూ హైద‌రాబాద్ ఎదుగుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది ఉద్యోగులు హైద‌రాబాద్ కేంద్రంగా విధులు నిర్వ‌హిస్తున్నారు. టెకీల‌కు సెజ్‌లు పెద్ద ఎత్తున ఉద్యోగ కేంద్రాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణ‌ రాష్ట్రంలో 68 సెజ్‌(స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌)లు ఉండ‌గా ఇందులో 42 ఐటీవి. మిగిలినవి ఇతర రంగాలవి. తాజాగా, భారీ ఉపాధి అంచనాలతో కొత్త ఐటీ సెజ్ రాబోతుండ‌టం ఉద్యోగార్థుల‌కు అనేక అవ‌కాశాల‌ను క‌ల్పించ‌నుంద‌ని తెలుస్తోంది.


కాగా, మ‌హ‌తా సంస్థ‌ సెజ్‌ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని అనుమతుల మండలి ఆమోదం కోసం దీనిని పంపించింది. ఈ నెల ఆరున  జరిగిన మండలి సమావేశంలో చర్చించారు. త్వ‌ర‌లో మండలి నుంచి అధికారికంగా అనుమతి రానుంద‌ని తెలుస్తోంది.ఈ ఏడాది చివ‌రి నాటికి లేదా వ‌చ్చే ఏడాది తొలి త్రైమాసికంలోసెజ్ కార్య‌క‌లాపాలు ప్రారంభం కానున్నాయ‌ని స‌మాచారం.


కాగా, ఐటీ ప‌రిశ్ర‌మ‌తో న‌గ‌రం అభివృద్ధి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్  నగరానికి పడమర దిక్కున ఐటీ కారిడార్‌ ఉండడంతో మాదాపూర్‌, గచ్చిబౌలి నుంచి మొదలు కొని తెల్లాపూర్‌, కొల్లూరు, పటాన్‌చెరు దాటి నగరం శరవేగంగా విస్తరిస్తోంది. దక్షిణం వైపు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం. హిమాయత్‌సాగర్‌, గండిపేట చెరువు ప్రాంతాల్లోనూ క్రమంగా నివాస ప్రాంతాలు వెలుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: