మొన్నటి ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుండి చంద్రబాబునాయుడు ఇప్పట్లో కోలుకునేట్లు కనబడటం లేదు. పదే పదే ఎందుకు ఓడిపోయామో తెలీటం లేదు..తెలీటం లేదు అంటూ ఒకటే సొద పెడుతున్నారు చంద్రబాబు. పార్టీ నేతలతో సమావేశమైనా, కార్యకర్తలతో భేటీ అయినా చివరకు పొలిట్ బ్యూరో సమావేశమైనా ఒకటే గోల. పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు చంద్రబాబుకు కారణాలు మాత్రం తెలియటం లేదట.

 

సరే గడచిన రెండు మాసాలుగా ఇదే గోల చేస్తున్న చంద్రబాబు తాజాగా రూటు మార్చారు. తాజాగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అసలు 23 మంది ఎంఎల్ఏలను మాత్రం ఎందుకు గెలిపించారో తనకు అర్ధం కావటం లేదంటున్నారు.  ఓటమి సహజమే కానీ మరీ ఇంత ఘోరంగానా ? అంటూ జనాలపై మండిపోయారు.

 

తన పాలనలో జనాలకు ఏమి తక్కువ చేశానో చెప్పాలంటూ ఓటర్లను నిలదీయటమే విచిత్రంగా ఉంది. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా జనాలు ఎందుకు ఓడించారబ్బా ? అన్నదే అందరినీ అడుగుతున్నారు. తన ధర్మసందేహాలను తీర్చేవారి కోసం బహుశా చంద్రబాబు వెతుకుతున్నట్లే కనిపిస్తోంది.

 

ఇదే విషయమై వైసిపి నేతలు సమాధానమిస్తు తమ పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులకు ప్రోత్సహించినందుకు పనిష్మెంటుగానే జనాలు టిడిపి తరపున 23 మంది ఎంఎల్ఏలను మాత్రమే గెలిపించినట్లు చెబుతున్నారు. అలాగే ముగ్గురు ఎంపిలను లాక్కున్న కారణంగానే టిడిపి తరపున కేవలం ముగ్గురు ఎంపిలను మాత్రమే గెలిపించినట్లు ఎద్దేవా చేస్తున్నారు.

 

చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదని తన్నే దున్నపోతని అర్ధమైన తర్వాతే జనాలు టిడిపిని ఛీ కొట్టి అధికారంలో నుండి దింపేశారంటూ వైసిపి ఎంఎల్ఏల అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.  అయినదానికి కానిదానికి జగన్మోహన్ రెడ్డిని అదేపనిగా వ్యతిరేకిస్తుంటే వచ్చే ఎన్నికల్లో మొన్న గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు కూడా మళ్ళీ గెలిచేది కష్టమేనేమో అన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: