ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డల్లాస్ పర్యటనకు ప్రవాసాంధ్రులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకు ఏడు వేల మందికి ఏ మాత్రం తగ్గకుండా ఎన్ఆర్ఐ జన సమీకరణకు చకచక ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇందుకు టెక్సాస్ వ్యాప్తంగా 25 బస్సులతో ప్రవాసులకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. సభాప్రాంగణంలో 1300ల  పార్కింగ్ స్థలాలను ,  200 గదులకు రిజర్వేషన్ చేయించినట్టు సమాచారం. జనసమీకరణకు గానూ 18వేల మంచినీళ్ల సీసాలు సమకూర్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ తన తొలి ఉత్తర అమెరికా పర్యటన సందర్భంగా  డల్లాస్ నగరంలో ఉత్తర అమెరికా ప్రవాసాంధ్రులతో సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇందుకు స్థానిక నిర్వాహకులు పక్కాగా, భారీ స్థాయిలో బ్రహ్మండమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇర్వింగ్‌లోని అల్టిమేట్ బార్బిక్యూ సమావేశ మందిరంలో  తుది సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  ఆతిథ్య, సాంస్కృతిక, రవాణా, ఆహార, రిజిస్ట్రేషన్, స్వాగత, భద్రత తదితర విభాగాలకు చెందిన స్వచ్ఛంద కార్యకర్తలు ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్షించారు.



టెక్సాస్ వ్యాప్తంగా ఆస్టిన్, హ్యూస్టన్ నగరాల నుండి ప్రవాసుల రవాణా కోసం ప్రత్యేకంగా 25బస్సులు ఏర్పాటు చేశామని రవాణా విభాగం పేర్కొంది. కన్వెన్షన్ సెంటరు సమీపంలోని హోటళ్లల్లో 200కుపైగా గదులు ఇప్పటికే ప్రముఖులు, అతిథుల కోసం బుక్ చేశారు. ఆహార కమిటీ స్పందిస్తూ 7నుండి10 వేల రానున్న ఈ సభకు శుక్ర, శనివారాల్లో ఆహార ఇబ్బందులు తలెత్తకుండా డిఎఫ్ డబ్ల్యూ  పరిసర ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్ల నిర్వాహకులుతో ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాకుండా సభ జరిగే డల్లాస్ కన్వెన్షన్ సెంటరు వద్ద 1300కు పైగా పార్కింగ్ స్థలాలను అతిథులు ఉచితంగా పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. వై.ఎస్.జగన్ పర్యటనలో ఎటువంటి అపశృతి చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. 



జగన్మోహన్ రెడ్డి డల్లాస్ విమానాశ్రయంలో దిగినప్పటి నుండి తిరిగి శనివారం సాయంత్రం సభ ముగిసేవరకు హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్‌తో పాటు స్థానిక కార్యకర్తలు తీసుకోవల్సిన భద్రతాపరమైన సహాయక చర్యలపై చర్చించారు. కేవలం అతిథుల కోసమే రికార్డు స్థాయిలో 18వేల మంచినీటి సీసాలను ఈ సభకు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రవాస యువత, చిన్నారులు ఆకట్టుకునే కార్యక్రమాలను రూపొందిస్తున్నారని తెలిపారు. సకుటుంబ సమేతంగా ఈ సభకు ప్రవాసులు పెద్దసంఖ్యలో హాజరుకావల్సిందిగా నిర్వాహకులు కోరారు.


డల్లాస్‌వ్యాప్తంగా ఇప్పటికే జగన్‌కు స్వాగతం పేరిట ఏర్పాటు చేసిన హోర్డింగులతో పాటు మరిన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా ప్రకటనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సన్నాహక సమావేశంలో డల్లాస్‌కు చెందిన నిర్వాహక బృంద సభ్యులు డా.కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, రత్నాకర్, శివా అన్నపురెడ్డి, క్రిస్టపాటి రమణ్‌రెడ్డి, దర్గా నాగిరెడ్డి, తిరుమలరెడ్డి, ఓబుల్‌రెడ్డి శ్రీనివాసరెడ్డి, శారద సింగిరెడ్డి, ఉమా కుర్రి, విశ్వనాధ్ కిచిలి, చింతల చంద్రారెడ్డి, ఫాల్గుణ్‌రెడ్డి, ఇస్మాయిల్, కృష్ణారెడ్డి, ఆదిత్య, మణి అన్నపురెడ్డి, డా.పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: