తెలంగాణ సీఎం కేసీఆర్ కు భక్తిభావం చాలా మెండు అన్న సంగతి తెలుసు. ఆయన తరచూ యజ్జాలు, యాగాలు, పూజలు చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను కూడా సందర్శిస్తుంటారు. కొన్ని నెలల క్రితం ఆయన దక్షిణ భారతంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు కూడా.


ఆయన తాజాగా తమిళనాడు కాంచీపురంలోని అత్తి వరదరాజ పెరుమాల్ ఆలయాన్ని సందర్శించబోతున్నారు. ప్రత్యేకంగా ఆ ఒక్క ఆలయం కోసమే పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి.. కేసీఆర్ ఎందుకు ఆ ఆలయాన్ని దర్శించుకోబోతున్నారు.. ఓసారి చూద్దాం..


కాంచీపురం దేవాలయాలకు నిలయం. వందల ఆలయాలు కలిగి ఉన్న ఈ నగరం శివకేశవ ఆలయాలకు కేంద్రంగా భాసిల్లుతోంది. వైకుంఠనాధుడైన శ్రీమహావిష్ణువు చిద్విలాసమూర్తిగా వరదహస్తంతో వరాలనొసిగే వరదరాజ పెరుమాళ్‌ ఆలయం ఇక్కడి మరో ప్రత్యేకత. ఎందుకంటే.. ఈ ఆలయంలోని అనంత శయనమూర్తి దివ్యమంగళ విగ్రహమైన అత్తి వరదర్‌ స్వామి చాలా అరుదుగా దర్శనమిస్తారు.


ఎంత అరుదుగా అంటే... కేవలం 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే దర్శనం ఇస్తారు. 40 ఏళ్లకు ఓసారి.. 48 రోజుల్లో ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకోవచ్చు. అరుదుగా లభించే దర్శనం కాబట్టి.. భక్తులు ఈ స్వామి దర్శనం కోసం బారులు తీరతారు. మరి ఈ స్వామి ఎందుకు కేవలం 40 ఏళ్లకోసారి దర్శనమిస్తారు.. అందుకు కూడా ఓ కథ ఉంది.


మధ్య యుగాల్లో దేవాలయాలపై ఇతరుల దాడుల సమస్య ఎక్కువగా ఉండేది. దేవాలయాలపై దాడులు చేసిన విగ్రహాలను ద్వసం చేసి.. దోచుకుని వెళ్లేవారు. ఆ భయం కారణంగానే.. స్వామి వారి విగ్రహాన్ని వెండిపెట్టెలో అమర్చి పుష్కరిణిలో దాచిపెట్టారు. ఆ తర్వాత 40 ఏళ్లకు ఆ పెట్టెను బయటకు తీసి స్వామివారిని ఆలయంలో ప్రతిష్టించి 48 రోజుల పాటు పూజిస్తారు. మళ్లీ పూజల అనంతరం.. స్వామిని అదే వెండిపెట్టెలో పెట్టి.. పుష్కరిణిలో భద్రపరుస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: