తెలుగుదేశంపార్టీ చరిత్రలో ప్రత్యేకించి చంద్రబాబునాయుడుకు ఇది నిజంగా పీడకలే అనుకోవాలి. తన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇంతటి దుర్భర పరిస్ధితి ఎదురవుతుందని చంద్రబాబు అనుకుని ఉండరు. తాజాగా భర్తీ చేయాల్సిన మూడు ఎంఎల్సీ స్ధానాల్లో ఒక్కటి కూడా టిడిపికి వచ్చే అవకాశం లేకపోవటానికి మించిన అవమానం ఇంకోటేముంటుంది ?

 

తెలుగుదేశంపార్టీ గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నది. అయితే ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కనీసం ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ కూడా పెట్టలేనంత స్ధాయికి దిగిపోలేదు. ఈనెల 26వ తేదీన మూడు స్ధానాలు భర్తీ అవ్వబోతోంది. ప్రతీ స్ధానానికి 44 మంది ఎంఎల్ఏలు ఓట్లు వేయాల్సుంటుంది. ఈ లెక్కన మూడు స్ధానాలూ  వైసిపికే దక్కబోతున్నాయి.

 

ఇక్కడే తెలుగుదేశంపార్టీకి సమస్య మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు. అంటే ఎంఎల్ఏల లెక్క తీసుకుంటే  టిడిపికి పోటి గురించి ఆలోచించే అర్హత కూడా లేదు. ఈనెలలో భర్తీ అవ్వబోయే మూడు స్ధానాలే కాదు భవిష్యత్తులో ఎంఎల్ఏల కోటాలో భర్తీ చేయబోయే ప్రతి ఎన్నికలోను ఇదే పరిస్ధితి తప్పదు.

 

సరే ఇక స్ధానిక సంస్ధలు, గవర్నర్ కోటా, పట్టభద్రుల కోటా...కోటా ఏదైనా కానీండి టిడిపి పరిస్ధితి దాదాపు ఇలాగే ఉంటుందనటంలో సందేహమే లేదు. కాకపోతే స్ధానిక సంస్ధల కోటాలో ఏమైనా కాసిని సీట్లు గెలుచుకుంటే పోటికి ఎక్కడైనా రెడీ అయ్యే అవకాశం దక్కుతుందేమో చూడాలి.

 

ఎంఎల్సీ ఎన్నికల్లోనే పోటికి అవకాశం దక్కటం లేదంటే ఇక రాజ్యసభ సీట్ల భర్తీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే రాబోయే ఐదేళ్ళు కూడా టిడిపి పరిస్ధితి ఇలాగే ఉంటుంది.  శాసనమండలిలో ప్రస్తుతం టిడిపికి బలమున్నా ఒక్కొక్కళ్ళు రిటైర్ అయిపోతున్నారు. దాంతో భర్తీ చేయాల్సిన ఖాళీలన్నీ వైసిపి ఖాతాలోకే పడతాయి.  ఆ విషయం తెలిసిన వాళ్ళు కాబట్టే ప్రస్తుతం శాసనమండలిలో టిడిపి పెద్దగా నోరిప్పటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: