తాము చెబుతున్నది ఎదుటి వాళ్ళు విని నమ్ముతారా ? లేకపోతే నవ్వుకుంటారా ? అన్న ఆలోచన కూడా లేకుండానే మాజీ స్పీకర్, సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు విచిత్రంగా మాట్లాడుతున్నారు. టిడిపి అధికారంలో నుండి దిగిపోగానే వైసిపి ప్రభుత్వం తమను వేధింపులకు గురిచేస్తోందంటూ విచిత్రమైన వాదన లేవనెత్తుతున్నారు.  తమ కుటుంబంపై పెట్టిన సుమారు 20 కేసులకు తోడు తమ టూ వీలర్ షోరూములను మూసేయటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే దాదాపు నాలుగు రోజుల క్రితం నరసరావుపేట, సత్తెనపల్లి పట్టణాల్లో ఉన్న రెండు టూవీలర్ షోరూములపై అధికారులు దాడులు చేశారు. గడచిన ఐదళ్ళుగా  వ్యాపారం చేస్తున్నా ట్యాక్సులు కట్టని కారణంగా రెండు షో రూములను అధికారులు సీజ్ చేసేశారు. ట్యాక్సులు కట్టని విషయాన్ని వదిలేసి షో రూములను మూసేయిచిన విషయమే కోడెల మాట్లాడుతున్నారు. ట్యాక్సులు కట్టకుండా షో రూములో వాహనాలు ఎలా అమ్ముతారంటే సమాధానం చెప్పటం లేదు.

 

పైగా గడచిన ఐదేళ్ళల్లో పై రెండు నియోజకవర్గాల్లో కొడుకు కోడెల శివరామ్, కూతురు కోడెల విజయలక్ష్మి చేసిన అరాచకాలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. వీళ్ళ అరాచకాలు, అవినీతి, ధౌర్జన్యాలు, మోసాలు అన్నీ అందరికీ తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా ఎవరైనా ఫిర్యాదులు చేయటానికి వస్తే ఎదురు వాళ్ళపైనే కేసులు పెట్టి వేధించారు. కోడెల మద్దతుతోనే కొడుకు, కూతురు అరాచకాలకు పాల్పడిన విషయం అందరికీ తెలుసు.

 

ప్రభుత్వం మారింది కాబట్టే పోలీసులు కూడా ఇపుడు వాళ్ళపై కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవాలు ఇలాగుంటే కోడెల మాత్రం తమ కుటుంబంపై వేధింపులకు దిగుతున్నట్లు అమాయకంగా చెబుతున్నారు. తమకసలు ఏ పాపమూ తెలీదన్నట్లుగా మాట్లాడుతున్నారు. చాలామంది టిడిపి బాధితులున్నట్లే తమ కుంటుంబం కూడా వైసిపి బాధిత కుటుంబం అంటూ విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: