జిల్లాల విభజన అంశం శ్రీకాకుళం జనాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలల్ని రేపుతోంది. ఆదాయ వనరులు భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కళింగాంధ్ర పేరుతో కదం తొక్కుతున్నారు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల ఎంపిక జరగకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ప్రజలకు దూరభారాలు తగ్గుతాయి. వ్యయప్రయాసలు తగ్గి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవచ్చు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి లాంటి పట్టణాలు జిల్లా కేంద్రాలుగా మారుతాయన్న ఆశతో అక్కడి ప్రజలుంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళనలో పడ్డారు.


'మన శ్రీకాకుళం మన భవిష్యత్తు' అన్న నినాదంతో కళింగాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఎచ్చెర్ల కాన్స్టెన్సీలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రెడ్డీస్ ల్యాబోరేటరీ, అరబిందో ఫార్మాస్యూటికల్స్, నాగార్జునా అగ్రి లాంటి   పారిశ్రామిక సంస్థలున్నాయి. ఇవన్నీ పైడిభీమవరంలో కేంద్రీకృతమై ఉన్నాయి. అంతేకాదు డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యా సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. పార్లమెంటరీ కాన్స్టెన్సీని బేస్ చేసుకొని జిల్లాలను విభజించడం వల్ల విద్య, వైద్యం నీరు అన్నీ కూడా కోల్పోతాం అని శ్రీకాకుళం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు లక్షా నలభై వేల కోట్లతో కొవ్వాడ లో నిర్మించబోయే అణు విద్యుత్ కేంద్రం కూడా జిల్లాగా ఏర్పడబోతుంది.


అనుకుంటున్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి పోతే ఇక తమ పరిస్థితి ఏంటని అక్కడి వారు నిలదీస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలతో కాకుండా, ప్రజలకు సమ న్యాయం జరిగేలా పునరాలోచించాలని శ్రీకాకుళం వాసులు కోరుతున్నారు. రాజాం నియోజకవర్గం లోనూ ఇదే పరిస్థితి. చిక్కోలు ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎమ్మార్ సంస్థ ఫౌండర్ గ్రంధి మల్లికార్జునరావు ఉన్న నియోజక వర్గం కూడా పోతే, ఇక కొత్తగా ఏర్పడబోయే శ్రీకాకుళం జిల్లాకు చెప్పుకోవటానికి ఏముంటుందని వాపోతున్నారు. ఆముదాలవలస సుగర్ ఫ్యాక్టరీ మూతపడి పదిహేను సంవత్సరాల దాటుతోంది. శ్రీకాకుళంలోని నియోజకవర్గంలో ఉన్నటువంటి మరో పరిశ్రమ మూతపడి మూడేళ్లవుతుంది.


ఎటువంటి ఆదాయ వనరులు లేనటువంటి ప్రదేశంగా ఇవాళ మిగిలిపోయింది. విద్యాసంస్థల లేవు, ఆదాయ వనరులు, పరిశ్రమలూ లేవు, పారిశ్రామిక ఓడ లేదు, ఏమీ లేకుండా ఉంటే అభివృద్ధి సాధ్యం ఎలా అవుతుంది.? అని శ్రీకాకుళం వాసులు అంటున్నారు. పేరు ప్రఖ్యాతి గాంచిన వివిధ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా రాజాం నియోజకవర్గంలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏర్పాటులో కొలమానం ప్రాతిపదికన పక్కనున్న విజయనగరంలో ఈ ప్రాంతాన్ని కలపాలి అనుకోవటం దారుణమని అంటున్నారు.


ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు ఉండాలి కానీ, ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. చిక్కోలు వాసుల డిమాండ్ కు తగ్గట్టుగానే ముందుకు సాగుతామని ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పోమని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఉపాధి, ఆదాయ వ్యయాలు వనరుల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు ఉండాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంతో ముందుకెళుతోంది అన్నది చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: