తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై బీజేపీ ఎదురుదాడి పెరుగుతోంది. ఆప‌రేష‌న్ తెలంగాణ‌తో ముందుకు సాగుతున్న క‌మ‌లనాథులు ముఖ్య నేత‌ల చేరిక‌ల‌తో ఉత్తేజంగా ఉన్నారు. కేసీఆర్ ప‌రిపాల‌న‌, ఆయ‌న‌ వ్య‌వ‌హ‌ర‌శైలి ఆధారంగా టార్గెట్ చేస్తున్న బీజేపీ నేత‌లు తాజాగా దానికి కుటుంబ పాల‌న‌, ఆయ‌న రాజ‌కీయ జీవితంపై విమ‌ర్శ‌లు మొద‌లుపెడుతున్నారు. ఇటీవ‌లే బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్ సార‌త్యంలో పలు పార్టీల నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ప్రజల కోసమే తెలంగాణ గురించి  కొట్లాడతున్నాము అని చెప్పిన కేసీఆర్..ఇప్పుడు కల్వకుంట్ల తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు. మహాబూబ్‌గర్ ఎన్నికల ఇంచార్జ్ గా హరీష్ రావును నియమించి.. గెలిచిన తర్వాత హరీష్ రావు గొంతు కోశారని ఆరోపించారు.


నమ్మించి వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ దిట్ట అని వివేక్ ఆరోపించారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచే దాంట్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాడన్నారు. కేసీఆర్ మొదట యూత్ కాంగ్రెస్, తర్వాత టీడీపీ, అనంత‌రం సొంత పార్టీతో రాజ‌కీయం నెరుపుతున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామిక తెలంగాణ గురించి కేసీఆర్ మర్చిపోయారని.. కల్వకుంట్ల తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని..ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 


పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు  కేసీఆర్ ఒక‌ చెంప చెల్లుమనిపించారని మరి కొద్దీ రోజుల్లో ఇంకో చెంప కూడా చెళ్లుమనిపిస్తారని వివేక్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఆయనకు గుణపాఠం చెపుతారని పేర్కొన్నారు. ప్ర‌జాస్వామిక తెలంగాణ సాధ్యమవుతుందని అనుకున్నారని, కేసీఆర్-కేటీఆర్‌లు ప్రజాస్వామిక తెలంగాణను మరిచారని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాటం చేయాలని వివేక్ అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చక్కటి పాలన అందిస్తున్నారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: