తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మ‌న్ ఆర్కే రోజాను అభినందించారు. కంచిలో ఉన్న శ్రీ అత్తివరదరాజ స్వామికి ప్రత్యేక పూజలు చేసేందుకు హైదరాబాద్ నుంచీ ప్రత్యేక విమానంలో కేసీఆర్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన అనంత‌రం షెడ్యూల్ ప్ర‌కారం ఆయ‌న రోడ్డు మార్గంలో కంచి అత్తి వ‌ర‌ద‌రాజ‌స్వామి దేవాల‌యానికి వెళ్లాల్సి ఉంది. దీంతో రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయిన‌ కేసీఆర్ రోడ్డు మార్గంలో వెళ్తుండ‌గా నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా ఘనస్వాగతం పలికారు. అనంత‌రం ఆమె కూడా కేసీఆర్‌తో కలిసి కాంచీపురం బయలుదేరారు. అక్కడ దర్శనం అనంతరం కేసీఆర్ రోజా ఇంటికి చేరిన సంద‌ర్భంగా ఈ ప్ర‌శంస ద‌క్కింది.

కాంచీపురంలో అత్తి వరద రాజు స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు విచ్చేసిన సంద‌ర్భంగా తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తదితరులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్ కుటుంబం నగరి ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లారు.. అక్కడ వారు భోజనాలు చేశారు.


ఈ సంద‌ర్భంగా స్వయంగా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యలకు ఎమ్మెల్యే రోజా వడ్డించారు. ఈ సంద‌ర్భంగానే గులాబీ ద‌ళ‌ప‌తి ఎమ్మెల్యే రోజాను అభినందించారు. `రుచిక‌ర‌మైన భోజ‌నం పెట్టావ‌మ్మ‌` అంటూ రోజాపై ప్ర‌శంస‌లు కురిపించిన‌ట్లు స‌మాచారం. కాగా, భోజ‌నం అనంతరం సీఎం కేసీఆర్ కుటుంబం తిరుమలకు బయలుదేరి వెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: