ఏపీలో 1 శాతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ పార్టీలో జోష్ పెరిగింది. ఎన్నికలు అయిన దగ్గర నుంచి ఆ పార్టీలోకి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి చాలా మంది నాయకులు కాషాయ జెండా కప్పేసుకున్నారు. రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్, జూనియర్ నాయకులు ఇలా టీడీపీలో ఉన్నవారు బీజేపీలోకి వెళ్లారు. ఇంకా చాలామంది వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.


అయితే ఈ వలసల జోరుతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. నాయకుల చేరికతో ఏపీలో మా పార్టీ బలపడుతుందని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో తాము పాగా వేయడం ఖాయమంటూ గాలి బాగా కొడుతూ, ఇతర పార్టీల నాయకులని ఆకర్షించే పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు చివరి వారంలో టీడీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని చెబుతున్నారు. టీడీపీలో ఉన్న బడా బడా నేతలు కాషాయ జెండా కప్పేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 


అలాగే ఇటీవల ఒక 7 లేదా 8 మంది ఎమ్మెల్యేల తప్ప మిగతా వారిని పార్టీలోకి తీసేకుంటామని అంటున్నారు. అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు బీజేపీతో దోస్తీ కోసం వస్తే తరిమేస్తామని, ఆయన దోస్తీ మాకు అక్కర్లేదని చెబుతున్నారు. టీడీపీ సంగతి అటు ఉంచితే కన్నా ఈ మధ్య వైసీపీని కూడా గట్టిగానే టార్గెట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై బాగానే విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డికి ఏదో చేయాలనే ఆత్రం తప్ప చేసే ఆచరణ లేదని, పనికి రాని విషయాల్లో అత్యుత్సాహం చూపించే జగన్‌, ప్రజల ఇబ్బందులు తొలగించడంలో మాత్రం విఫలం అయ్యాడంటూ విమర్శలు చేస్తున్నారు. 


విమర్శలే కాకుండా వైసీపీ నుంచి కూడా త్వరలో బీజేపీలోకి వలసలు ఉంటాయని సంచలన కామెంట్స్ చేసేశారు. వైసీపీ నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు. త్వరలో బీజేపీలోకి సునామిలాగా వలసలు కొనసాగుతాయని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి టీడీపీ నుంచి, వైసీపీ నుంచి వచ్చే ఆ నేతలు ఎవరో కన్నాకే తెలియాలి. కన్నా నిజంగానే అన్నారా లేక తాను పార్టీ ప్రెసిడెంట్ ని కార్యకర్తల్లో పరువు నిలుపుకోవాలని అన్నారో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: