రాజ్యాంగంలో 370 ఆర్టికల్ ను రద్దు చేసి జమ్ము కశ్మీర్ ప్రత్యేక పరతిపత్తిని ఒక్క దెబ్బతో కాలిరాసేసిన నేపథ్యంలో తమ పరిస్థితి కూడా అలాగే అవ్వొచ్చనే భయాందోళ‌నలు ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో బయలుదేరాయి. తమకు ప్రత్యేక హక్కులు కల్పించిన 371 ఆర్టికల్ ను కూడా బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందనే భయం వాళ్ళను వెంటాడుతోంది. ఏ రెడ్‌ అలర్ట్‌ టు ది పీపుల్‌ ఆఫ్‌ నార్త్‌ ఈస్ట్‌ʹ అంటూ మిజోరం మాజీ ముఖ్యమంత్రి లాల్‌ తన్హావులా చేసిన ట్వీట్ ప్రజల భయానికి తగ్గట్టుగానే ఉన్నది.


నాగాలాండ్‌లో ఈ ఆందోళన ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకుపోవడంతో ʹఅలాంటి ఆందోళన ఏమీ అవసరం లేదు. 371 ఏ ఆర్టికల్‌ కింద మీకు కల్పిస్తున్న హక్కులు పవిత్రమైనవిʹ అంటూ నాగాలాండ్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్ రవి ఓ ప్రకట్న చేశారు. అయితే ఆ ప్రకటనను విశ్వసించడం లేదు. జమ్ము కశ్మీర్ లో మహ్బూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో 370 ఆర్టికల్ ను రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పింది. అలా చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆ ఆర్టికల్ ను రద్దు చేసిందినే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు.


ప్రత్యేక నాగాలాండ్‌ దేశం కోసం నాగాలు కొన్ని దశాబ్దాలపాటు సాయుధ పోరాటం జరిపారు. ఆ తర్వాత వారు కేంద్రంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ రాష్ట్రానికి మరింత స్వయం ప్రతిపత్తి కావాలంటూ పలు నాగా గ్రూపులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. వారితో ఎప్పటికప్పుడు చర్చలు జరిపేందుకు మధ్యవర్తి రవినే రాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ʹమాకున్న హక్కులను రద్దు చేస్తారనే భయం ఇప్పుడు ప్రతి నాగాను వెంటాడుతోంది. మా ప్రత్యేక రాజకీయ చరిత్ర, సామాజిక సంస్కృతిని పరిరక్షించుకునేందుకు 371 ఏ కన్నా మంచి చట్టాలు కావాలంటూ మేము చర్చలకు సిద్ధమైన నేపథ్యంలో 371ఏను కేంద్రం రద్దు చేయాలనుకోవడం అంతకన్నా హస్వ దృష్టి మరోటి ఉండదుʹ అని నాగా విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు నైనతో అవోమి వ్యాఖ్యానించారు.

దేశంలోని మైనారిటీల పట్ల బీజేపీకి ప్రత్యేక అభిమానం లేకపోవడం, పార్లమెంట్‌లో వారికి ఎదురులేకపోవడం వల్ల ఇలాంటి భయాలు నాగాలకు కలుగుతున్నాయని మెజారిటీ నాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ʹనాగా హొహోʹ అధ్యక్షుడు పీ చుబా ఓజికుమ్‌ అన్నారు.జమ్మూకశ్మీర్ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని క్రిషక్ ముక్తీ సంగ్రామ్ సమితి(కెయంఎస్‌ఎస్) సలహాదారుడు, ఆర్టీఐ ఉద్యమకారుడు అఖిల్ గోగోయ్ అన్నారు.


కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ వ్యవహారం లాంటి రాజకీయపరమైన చర్యలు తీసుకునేముందు ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానాలను, సంస్కృతులను గౌరవించాల్సిన అవసరం ఉందని మణిపూర్ గిరిజన ఫోరానికి చెందిన ఒనిల్ క్షేత్రియుం అన్నారు.మిజోరాం రాష్ట్రంలోనూ బయటి వ్యక్తులు స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు వీళ్లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు లాల్ థన్వాలా కూడా మిజోరాం భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. "ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఇదొక రెడ్ అలర్ట్. రాజ్యాంగపరమైన రక్షణ కలిగిన మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఇది ముప్పుగా మారింది. ఆర్టికల్ 35ఎ, ఆర్టికల్ 370లను రద్దు చేస్తే, మిజోరాం గిరిజనులకు రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్ 371జీ ప్రమాదంలో పడినట్లే" అంటూ ఆయన ట్వీట్ చేశారు


మరింత సమాచారం తెలుసుకోండి: