ధనవంతుల దగ్గర నుంచి పేదవారి వరకు డబ్బులు తమదైన శైలిలో పొదుపు చేస్తుంటారు. పేదవారికోసం అతి తక్కువ ధరలకే ఆదా చేసుకునే అంశం వస్తే, మన మనసులో మొదట గుర్తోచ్చేది పోస్టాఫీసులు.పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేస్తే సొమ్ము భద్రం అని అంతా భావిస్తుంటారు. తక్కువ వడ్డీ వచ్చిన డబ్బుకు భద్రత ఉంటుందనే కొంచెం కొంచెం కూడబెడతుంటారు. కానీ అనంతపురం జిల్లాలో పోస్టాఫీస్ ఖాతా దారులు లబోదిబోమంటున్నారు. తమ సొమ్ము తమకు దక్కకపోతే చావే దిక్కు అని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మెయిన్ బజార్ లోని సబ్ పోస్టాఫీస్ ఖాతా దారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఖాతాల్లో లేకపోవటంతో గుండెలు బాదుకుంటున్నారు . ఆ బ్రాంచ్ పోస్టుమాస్టర్ రాముడు ఖాతాదారుల డిపాజిట్ సొమ్మును దారి మళ్లించడంతో వీరంతా రోడ్డున పడ్డారు. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల డిపాజిట్ సొమ్మును మాయం చేశాడు రాముడు. డిపాజిట్ లు కాజేసి పరారైన రాముడి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. ఓ ఖాతాదారుడు తన పొదుపు సొమ్ము లక్షా అరవై వేల రూపాయలు తీసుకోవటానికి వెళ్తే పోస్టు మాస్టర్ రాముడు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

తన సేవింగ్స్ ఖాతాలో లక్ష అరవై వేలకు బదులు ఎనభై వేల రూపాయలు మాత్రమే నిల్వ ఉందని తెలుసుకున్న ఖాతాదారుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్ళేసరికి మిగతా ఖాతాదారుల్లో కలకలం చెలరేగింది. కానీ అంతకు ముందే ఆ పోస్టుమాస్టర్  తాడిపత్రి నుంచి తన దుకాణాన్ని ఎత్తేశాడు. దీంతో ఖాతా దారులు ఆందోళనకు దిగారు. ఒక్కొక్కరి ఖాతాలో పరిశీలిస్తే నగదు నిల్వలు తక్కువగా ఉన్న సంగతి తేలింది. ఖాతాదారుల పాస్ బుక్ లలో మొత్తాలకూ పోస్టాఫీస్ రికార్డుల్లోనే నగదు నిల్వలకు తేడాల్ని గమనించిన తనిఖీ అధికారి విజయ్ కుమార్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోస్టు మాస్టర్ రాముడు మూడు రోజులుగా సెలవులో ఉన్నాడనీ పూర్తి స్థాయి విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.

అయినా సరే బాధితులు వారీ ఆందోళన కొనసాగించారు. కొడుకుల చదువు కూతుళ్ల పెళ్లి కోసం దాచుకున్న సొమ్ముకు గ్యారెంటీ లేకపోవడంతో పోస్టాఫీస్ ఖాతా దారులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. పోస్టు మాస్టర్ రాముడు ఎక్కడున్నా పట్టుకుని తమ సొమ్ము తమకు ఇప్పించకపోతే తమ కుటుంబానికి ఆత్మహత్యే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు.చాలా మంది ఖాతా దారులు పగలు రాత్రి కష్టపడి కూడపెట్టిన సొమ్ము ఇలా తమకు కాకుండా పోయిందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వ్యవహరించి తమకు తగిన న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పోస్టల్ ఎస్పీ ఆదినారాయణ కూడా రికార్డులు పరిశీలించి అవకతవకులను గుర్తించారు. పోస్టల్ ఎస్పీని చుట్టుముట్టిన బాధితులు పోస్టాఫీస్ ఎదుట ధర్నా చేశారు.

తాడిపత్రి పోలీసులు సైతం పోస్టల్ ఎస్పీని కలిసి ఖాతాదారులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డిపాజిట్ దారుల భావోద్వేగాలను అర్థం చేసుకున్న ఎస్పీ నెలలో అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిండా ముంచి ఉడాయించేసిన పోస్ట్ మాస్టర్ రాముడు ఎక్కడున్నాడో వెతికి అతని వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు తేలాల్సిన విషయం. పరారీలో ఉన్న రాముడు అరెస్ట్ చేసి  ఈ కేసులో మరిన్ని నిజాలు వెలుగు చూసి ప్రజలకు న్యాయం చేయాలని పోలీసులని కోరారు . 



మరింత సమాచారం తెలుసుకోండి: