తెలుగుదేశంపార్టీ మాజీ ఎంఎల్ఏ బోండా ఉమా మహేశ్వరరావు మౌనానికి అర్ధమేంటో అర్ధంకాక పార్టీ నేతలు, శ్రేణులు బుర్రలు గోక్కుంటున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత పార్టీ మారటం లేదనే మొక్కుబడి ప్రకటనైతే చేశారు లేండి. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి బోండా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదు. అదే సమయంలో  మొన్నటి ఎన్నికల్లో తనతో పాటు పోటి చేసి ఓడిపోయిన కాపు అభ్యర్ధులు, నేతలతో కాకినాడలో ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేశారు.

 

చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉండగా జరిగిన రహస్య సమావేశం తర్వాత బయటపడినపుడు పార్టీలో సంచలనంగా మారింది. అప్పటి నుండి బోండాతో పాటు చాలామంది నేతలు టిడిపికి రాజీనామా చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి తోడు గడచిన నెల రోజులుగా బోండా ఆస్ట్రేలియాలోనే పర్యటించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడు టిడిపి అభిమానులు ఆత్మీయ సమావేశాలు పెట్టి హాజరు కావాల్సిందిగా కోరినా బోండా తిరస్కరించారు.

 

ఇవన్నీ చూసిన తర్వాత బోండా పార్టీకి గుడ్ బై చెప్పేయటం ఖాయమనే ప్రచారం మరింత ఊపందుకుంది. అదే సమయంలో పార్టీ మార్పు విషయమై స్పష్టమైన సమాచారం చెప్పకుండా ఫెస్ బుక్ లో నర్మగర్భ వ్యాఖ్యలు చేయటం నేతలను మరింత గందరగోళ పరిచింది. సరే విషయం ఏదైనా బోండా టాపిక్ ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నేపధ్యంలోనే ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చిన బోండా వెంటనే చంద్రబాబుతో భేటీ అయ్యారు.

 

భేటీ అనంతరం అక్కడే ఉన్న నేతలతో కూడా ఏమీ మాట్లాడకుండా బోండా వెంటనే వెళ్ళిపోయారు.  పార్టీ మారేట్లయితే చంద్రబాబుతో ఎందుకు భేటీ అవుతానంటూ ప్రకటన చేసినా ఎవరికీ నమ్మకం కుదరటం లేదు. మొత్తానికి ఇప్పటికే విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యవహారంతో పార్టీ రోడ్డుమీద పడింది. తాజాగా తోడైన బోండా వ్యవహారంతో మరింత డ్యామేజి జరగటం ఖాయమనే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: