వైయస్సార్ ప్రభుత్వంలో ఇప్పటికే కీలకమైన నామినేటెడ్ పోస్టులు చాలా వరకు భర్తీ అయిపోయాయి. మరి లక్ష్మీ పార్వతికి ఏ పదవి ఇవ్వబోతున్నారు. అసలు జగన్ మనసులో ఏముంది.  టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును ఆయన పుట్టిన జిల్లాకి పెట్టి గౌరవిస్తామని ఎన్నికలకు ముందే జగన్ హామీ ఇచ్చారు. మరి అదే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతిని వైసిపి ఇలా గౌరవించబోతుంది అన్నది రాజకీయ వర్గాలతో పాటుగా సామాన్య ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది. లక్ష్మీపార్వతిని ఎన్నికల బరిలోకి దించాలన్న ఆలోచన కూడా ఒకానొక సందర్భంలో వైసీపీ నేతలు చేశారట. అయితే, లక్ష్మీ పార్వతి ఎమ్మెల్యే గా పోటీ చెయ్యడానికి ఆసక్తిని చూపించలేదట.

ఇటు జగన్ కూడా ఆమెను ఎన్నికల సంగ్రామంలో దింపడానికి ఇష్టపడలేదట. దీంతో వైసీపీ గెలిచిన నాటి నుంచి లక్ష్మీపార్వతికి ఏ పదవి ఇస్తారన్న చర్చ క్రమంగా పెరుగుతూ వచ్చింది.  లక్ష్మీపార్వతికి ఆ పదవి ఇవ్వబోతన్నారు, ఈ పదవి ఇవ్వబోతున్నారన్న డిస్కషన్ ఒకవైపు సాగుతూంటే, అటు నామినేటెడ్ పదవుల భర్తీ మొదలైంది. కీలకమైన నామినేటెడ్ పోస్టులో ఒకటైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని రోజాకి ఇచ్చారు. ఆ తర్వాత ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గా వాసిరెడ్డి పద్మని నియమించారు. కానీ లక్ష్మీ పార్వతి విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఈ ఆలస్యం వెనుక ఉన్న కారణమేంటి అసలు జగన్ మనసులో ఏముందన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోందట.


టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మీద లక్ష్మీ పార్వతి చేస్తూ వచ్చిన పోరాటం ఈ నాటిది కాదు. ఆ పోరులో దాదాపుగా ఒంటరైన లక్ష్మీ పార్వతి తరువాత రోజుల్లో వైసీపీలో చేరి తన దాడి కొనసాగించారు. నిజానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి ఉంటే ఖచ్చితంగా లక్ష్మీపార్వతికి క్యాబినెట్ లో చోటు దక్కి ఉండేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కానీ, అది జరగలేదు. మరి ఇప్పుడేం జరగబోతోంది అన్న ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

లక్ష్మీ పార్వతి మాత్రమే కాదు చంద్రబాబు మీద గత ఐదేళ్ల కాలంలో తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ వచ్చారు పోసాని కృష్ణమురళి. కేవలం వైసిపికి మద్దతు ప్రకటించినట్టు కాకుండా సీరియస్ వైసీపీ లీడర్ లానే చంద్రబాబు మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు పోసాని. కానీ, ఆయనకు కూడా ఇంత వరకూ ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో లక్ష్మీ పార్వతి, పోసాని లను ఎలా గౌరవించాలన్న దానిపై జగన్ కి ఒక స్పష్టత ఉందని వైసీపీ వర్గాలు చర్చించు కుంటున్నాయట. ఈ నేపధ్యంలో లక్ష్మీపార్వతికి ఎమ్మెల్సీ ఇస్తారా, లేక మరేదైనా కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: