ఇటీవలి కాలంలో ఏపీ సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేరుగా కంటే ఎక్కువగా ట్వీట్ల ద్వారానే ఈ యుద్ధం సాగుతోంది. ఐతే.. అనూహ్యంగా ఈ రోజు మాత్రం ఇద్దరూ ఒకేవిషయంపై ఒకే మాటపై ట్వీట్ చేశారు.


అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకమని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్ చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని చేరుకుంటున్నాయని జగన్‌ ట్వీట్‌ చేశారు. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు సైతం ఇదే అంశంపై ఇదే తరహాలో ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్ లో ఏమన్నారంటే..!

జీవనదులు కృష్ణా, గోదావరి పరవళ్లు.. రిజర్వాయర్లలో జలకళ. నదీనదాలన్నీ నీటితో నిండాలి, జలాశయాలు కళకళలాడాలి, రైతన్న కళ్లల్లో ఆనందం నిండాలి, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కావాలన్నదే ఆకాంక్ష. ప్రతి నీటిచుక్క సద్వినియోగం కావాలి. రైతాంగానికి లబ్ది చేకూరాలి.


గత 5 ఏళ్లలో 21 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. వేలాది చెక్ డ్యామ్ లు, పది లక్షల పంటకుంటలు తవ్వాం. నీరు-చెట్టు, నరేగా పనులెన్నో చేశాం. జల సంరక్షణ ఉద్యమంగా జరిపాం. మనం చేసిన పనులకు సార్ధకత కృష్ణమ్మ పరవళ్లతోనే, తల్లి గోదావరి జలధారలతోనే..


ఈ నేతలు ట్వీట్లలో సారూప్యానికి ప్రకృతి పరవశమే కారణం.. ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ కళకళలాడుతున్నాయి. వరద ఉద్ధృతి కొనసాగుతున్నందున సోమవారం సాగర్‌లో 26 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నాగార్జునసాగర్‌ జలకళ సంతరించుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: