చంద్రబాబు మళ్ళీ మామూలు అయిపోయారు. ప్రతీ రోజూ టెలికాన్ఫరెన్సులు.. పార్టీ నేతలతో రివ్యూలు, మీటింగులు తెగ బిజీ అయిపోయారు. చంద్రబాబు ఎందుకింత తొందరపడుతున్నారో  క్యాడర్ కి అసలు అర్ధం కావడంలేదట. పార్టీ ఓడిపోయి వందరోజులు కూడా కాక ముందే బాబు ఆగమాగం వెనక రీజనేంటి అని పార్టీలో ఉన్న సీనియర్ తమ్ముళ్ళు చర్చలు పెడుతున్నారట.


చంద్రబాబు బేసిగ్గా మీడియా బేబీ అని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఏనాడో బిరుదు ఇచ్చేశారు. ఆయనకు తెల్లారి లేస్తే మీటింగులు చెప్పుకోకపోతే కుదరదని అనేక పార్టీల నాయకులు కూడా అంటారు. సీఎం గా అయిదేళ్ళ పాటు పాలించిన బాబుకు అపుడు పార్టీ నాయకులు అందుబాటులోకి వచ్చేవారు. ఇపుడు కాగడా పెట్టి వెతికినా కూడా అయిపూ అజా లేరు. ఎందుకంటే ఎవరి బాధల్లో వారు ఉన్నారు.


బాబు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. తాను పెట్టే మీటింగులకు ఎవరైనా రాకపోతే కంగారు పడుతున్నారట. వారు నిజంగా రాలేదా కారణం ఉందా అని వాకబు చేస్తున్నారుట. ఎందుకంటే రాని వారి ఏ పార్టీలోకైనా జంప్ చేస్తున్నారేమోనని బాబు బేజారెత్తిపోతున్నారట. ఇక బాబు ఇపుడు జగన్ని టార్గెట్ చేస్తూ వరసగా పార్టీ మీటింగులు పెట్టేస్తున్నారు.


నిన్నకాక మొన్న పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టిన బాబు ఈ రోజు రాష్ట్ర స్థాయి పార్టీ మీటింగ్ పెడుతున్నారు. ఈ మీటింగ్ అజెండా ఏంటి అంటే వైసీపీ సర్కార్ ఆగడాల మీద పోరాటం కోసమట. మూడు నెలల పాలనలోనే వైసీపీ టీడీపీ క్యాడర్  మీద దాడులు చేస్తొందని, ఎక్కడికక్కడ టీడీపీని దెబ్బ తీస్తోందని బాబు పార్టీ నాయకులకు చెప్పబోతున్నారట. ఇది బయటకు కనిపించే విషయంగా ఉన్నా అసలు అజెండా వేరే ఉందని అంటున్నారు.


 రాష్ట్ర స్థాయి మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారో బాబుకు ఓ అంచనా ఏర్పడుతుందని అంటున్నారు. దాన్ని బట్టి ఆయన పార్టీకి రిపేర్లు చేసుకుంటారట. వచ్చిన వాడే తన వైపు నిలబడే  నాయకుడని, వారికే పార్టీ పదవులు పంచుతారట. మొత్తానికి బాబు ఆగమాగం అవుతున్నది జగన్ సర్కార్ మీద పోరాటాలకు కాదు, తన పార్టీని సర్దుకోవడానికి అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: