అధికార పార్టీ రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టిడిపి మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ లాగ తయారవుతున్నాడా అనే అనుమానం వస్తోంది. గెలిచిన దగ్గర నుండి కోటంరెడ్డి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.  నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి మంచి పాపులారిటీ ఉన్న నేత అనటంలో సందేహం లేదు. అయితే జిల్లాలో పదికి పది నియోజకవర్గాలూ గెలిచిన సంతోషం కూడా లేకుండా కోటంరెడ్డి వరుసగా వివాదాల్లో ఇరుక్కోవటమే ఆశ్చర్యంగా ఉంది.

 

నెల్లూరు సీనియర్ పాత్రికేయుడు డోలేంద్రప్రసాద్ తో రేగిన వివాదంతో కోటంరెడ్డి మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఒకవైపు డోలేంద్ర మరోవైపు కోటంరెడ్డి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇందులో ఎవరు నిజం చెబుతున్నారన్న విషయాన్ని కాసేపు పక్కనపెడదాం.

 

పదే పదే కోటంరెడ్డే ఎందుకు వివాదాస్పదమవుతున్నాడు ?  ఆ మధ్య కూడా మరో పాత్రికేయునితో ఇటువంటి గొడవే అయ్యింది. మొబైల్ ఫోన్లో నోటికొచ్చినట్లు బూతులు తిట్టిన విషయం బాగా వైరల్ అయ్యింది.  అసెంబ్లీలో చంద్రబాబునాయుడును ఉద్దేశించి మాట్లాడినపుడు కూడా ఇదే ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడిన విషయం అందరూ చూసిందే. రాజకీయాల్లో ఉన్నపుడు నేతలకు సంయమనం చాలా అవసరం. పైగా అధికారంలో ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి.  

 

ఎక్కడైనా కొంచెం జరిగినా ఏదో జరిగిపోతోందని టిడిపి, ఎల్లో మీడియా చేస్తున్న రచ్చ తెలిసిందే.  టిడిపి అధికారంలో ఉన్నపుడు చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు అలా వదిలేసిన కారణంగానే జనాల్లో టిడిపికి బ్యాడ్ ఇమేజి వచ్చేసింది. మద్దతుదారులకు బాగానే ఉండచ్చు కానీ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రమంతా పార్టీపై నెగిటివ్ ప్రచారం జరిగిపోయింది. రేపు జగన్ కు ఇదే పరిస్ధితి ఎదురు కాకూడదన్నా, వైసిపిపై నెగిటివ్ ప్రచారం జరగకూడదన్నా కోటంరెడ్డిని కంట్రోల్ చేయాల్సిన అవసరం జగన్ కే ఎక్కువుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: