అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఉండాలి.. ఉపాధి కావాలంటే పరిశ్రమలు ఉండాలి.. కానీ ఆ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కూడా మనమే భరించాలి. తగిన నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పరిశ్రమలు నిర్వహిస్తే కాలుష్యం పరిమిత స్థాయిలో ఉండి అంతగా హానికరం కాదు. కానీ పారిశ్రామిక వేత్తలు లాభాలకు మరిగి కాలుష్య నియంత్రణపై దృష్టి సారించకపోవడంతో అది ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది.


హైదరాబాద్ శివార్లలోని పలు పరిశ్రమల చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఇదే. ప్రత్యేకించి పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, జిన్నారం, కొండాపూర్‌, జహీరాబాద్‌, హత్నూర వంటి ప్రాంతాల్లో ఈ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రత్యక్షంగా కొందరికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమలు పరోక్షంగా వేలాది మంది ఉపాధికి ముప్పుగా మారాయి. ప్రాణాలను సైతం హరిస్తున్నాయి.


పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం వెర్రితలలు వేయకుండా కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలు ఏ స్థాయిలో కాలుష్యం వెదజల్లుతున్నాయో లెక్కించాలి. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేస్తున్నాయో గమనించాలి. ఇక్కడే వస్తోంది అసలు తంటా. ఈ పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయడం అంటే ఖర్చుతో కూడిన పని. అందుకే ఆ పరిశ్రమలు ఈ వ్యర్థాలను మురుగు కాల్వల ద్వారా జనం పైకి వదిలేస్తుంటాయి.


ఈ పారిశ్రామికవేత్తల అరాచకాలను కట్టడి చేయాల్సిన కాలుష్య నియంత్రణ అధికారులు మాత్రం తూతుమంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా ఆ పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతాల జనం ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా వేల సంఖ్యలో పరిశ్రమలు ఉంటే... గత ఐదేళ్లలో పీసీబీ కేవలం 385 కంపెనీలపైనే చర్యలు తీసుకుంది.


పారిశ్రామిక వేత్తల అత్యాశ, పారిశ్రామిక మండలి నిర్లక్ష్యం వెరసి... హైదరాబాద్ శివార్లలోని గ్రామస్తుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. శివార్లలోని పలు చెరువుల్లో జలాలు విషతుల్యమయ్యాయి. టైర్ల నుంచి ఆయిల్‌ తీసే పరిశ్రమల కారణంగా భరించలేని వాసనలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయి. కొన్నిచోట్ల పంట పొలాల మీద బూడిద పేరుకుపోతోంది. మరి ఈ ఇక్కట్లపై అధికారులు స్పందించేదెప్పుడో..


మరింత సమాచారం తెలుసుకోండి: