తాజగా టిడిపి ఎంఎల్ఏ బుచ్చయ్యచౌదరి మాటలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రస్ధాయి విస్తృత సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన బుచ్చయ్య  మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  చంద్రబాబునాయుడు హయాంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలైనా పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందంటే ఎక్కడో లోపం ఉందన్నారు.

 

ఎన్నికల సమయంలో కానీ అంతకుముందు కానీ మంత్రులు, జిల్లా, మండల స్ధాయిలో నాయకత్వాలు విఫలమవ్వటం వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. నియామకాల్లో పారదర్శకత కోసం చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెరలేపటం వల్లే పార్టీ నష్టపోయిందన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే పార్టీ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అంటే గ్రామస్ధాయిలోని కార్యకర్తలను చంద్రబాబు గాలికొదిలేస్తే జగన్ మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

 

ఇక్కడే బుచ్చయ్య ఓ విషయం మరచిపోయారు. చంద్రబాబు హయాంలో కూడా పార్టీ క్యాడర్, నేతలకు బాగానే ప్రాధాన్యత దక్కింది. ఎలాగంటే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన సర్పంచులను కాదని చంద్రబాబు జన్మభూమి వ్యవస్ధను బలోపేతం చేశారు. జన్మభూమి కమిటిలు మొత్తాన్ని పార్టీ వారితోనే నింపేశారు. కాకపోతే అదే జన్మభూమి కమిటిలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఓ మాఫియా లాగ తయారయ్యాయని చివరకు టిడిపి నేతలే నెత్తి నోరు మొత్తుకున్నారు.

 

గ్రామస్ధాయిలో ఏ సంక్షేమ పథకం అందాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా జన్మభూమి కమిటి అనుమతి కావాల్సిందే అన్నట్లుగా తయారైంది. చివరకు టిడిపి నేతలైనా సరే జన్మభూమి కమిటిలకు డబ్బులు ముట్టచెప్పందే పథకాలు మంజూరు కావటం లేదని టిడిపి నేతలే ఫిర్యాదులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కాకపోతే చంద్రబాబే ఎవరేం చెప్పినా పట్టించుకోలేదు. అందుకనే గ్రామస్ధాయిలో తెలుగుదేశంపార్టీ అంటే జనాలకు మండిపోయింది. కాబట్టే మొన్నటి ఎన్నికల్లో కసికొద్ది చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లేసి ఓడగొట్టిన విషయాన్ని ఇపుడు బుచ్చయ్య చెబుతున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: