ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీ అన్ని సీట్లకు పోటీ చేసింది.  కానీ అనూహ్యంగా ఒక్క సీటు మాత్రమే గెలిచింది. విచిత్రం ఏంటంటే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.  ఆయనతో పాటుగా పోటీ చేసిన అందరూ ఓడిపోయారు.  కానీ రాజోలు నియోజకవర్గానికి చెందిన రాపాక వరప్రసాద్ ఒక్కరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  తాజాగా తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కొద్దిసేపటి క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఇటీవల మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో ఆయనతో పాటూ అనుచరులపై మలికిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పేకాడుతున్న వారికి వత్తాసు పలికారని.. పోలీస్ స్టేషన్‌పై దౌర్జన్యం చేసి, ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాల వచ్చాయి. అంతే కాదు ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారని, పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేయడంతో సీరియస్ అయిన అధికారులు రాపాక వరప్రసాద్ పై నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మంగళవారం రాజోలు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. కాగా, ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్‌ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్న 9 మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేసి నానా రభస చేశారు.   ఈ కేసులో రాపాక ఏ1గా ఉన్నారు.

ఈ విషయంపై ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ మాట్లాడుతూ..ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండా సదరు ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం  యువతకు పోలీస్‌ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఒకవేళ ఎస్‌ఐ తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: