ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం భారీ ఎత్తున చేపడుతోన్న కార్యక్రమం.. స్పందన. తమ సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు.. పెట్టిన అర్జీలను సకాలంలో పరిష్కరించడానికి జగన్‌ సర్కార్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ తరహా కార్యక్రమం ఇప్పటి వరకు సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద మాత్రం లేదు.  ప్రతి సోమవారం అన్నట్టుగా కాకుండా.. ప్రతి రోజూ సందర్శకులను అనుమతించి.. అర్జీలను స్వీకరించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 


సీఎం అంటే ఎవరికి అందని మనిషి కాదు.. సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటారు. వారి సమస్యలను వింటారు. వెంటనే పరిష్కరిస్తారనే భావనను కలిగించింది నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డే అనే చెప్పాలి. అప్పటి వరకు సీఎంలుగా వ్యవహరించిన వారు వివిధ సందర్భాల్లో ప్రజలను కలిసినా.. ప్రజలను రెగ్యులరుగా కలవడం అనే వ్యవహారాన్ని తన షెడ్యూల్లో ఓ భాగంగా చేసిన ఫస్ట్‌ సీఎం మాత్రం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డే అని చెప్పాలి. ఈ క్రమంలో ఆ తర్వాత అదే అలవాటును ఆ తర్వాత వచ్చిన సీఎంలు కొనసాగించారు. ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ పగ్గాలు చేపట్టారు. పాలనా పగ్గాలు చేపట్టి రెండు నెలలు పూర్తి కావస్తున్నా.. ఇప్పటి వరకు ప్రజలను కలిసే కార్యక్రమాన్ని మాత్రం ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు.


అయితే ప్రజలు తమ సమస్యలను సర్కార్ దృష్టికి తెచ్చేందుకు గతంలో ఉన్న గ్రీవియన్స్‌ డేను మరింతగా బలోపేతం చేస్తూ స్పందన కార్యక్రమం పేరుతో నిర్వహించేందుకు సర్కార్‌ ఫుల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర సచివాలయం మొదలుకుని.. మండల స్థాయి కార్యాలయాల్లో పని చేసే అధికారులంతా ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో ఉండాలి.. వారి నుంచి అర్జీలు స్వీకరించాలి. వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలి.. ప్రతి అర్జీకి జవాబు చెప్పే విధంగా వ్యవహరించాలి. ఇదీ స్పందన కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.


స్పందనపై వారం వారం సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్షిస్తున్నారు. వచ్చిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే అధికారులకు క్లాసులు పీకుతున్నారు. అంతా బాగానే ఉంది. కానీ.. సీఎం ఇంటి దగ్గరే ఈ తరహా వ్యవస్థ లేకుండా పోయింది. సీఎంగా జగన్‌మోహన్‌ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే క్యాంప్‌ కార్యాలయం వద్దే ప్రజా దర్బార్‌ లాంటిది ఏర్పాటు చేసి ప్రజలను ప్రతి రోజూ ఉదయం కలిసే అవకాశం కల్పించాలని అనుకున్నారు. కానీ ముందుగా పాలనా వ్యవహరాలు.. ఇచ్చిన హామీలను అమల్లోకి తెచ్చే అంశాలు.. నవరత్నాలు.. మేనిఫెస్టో అమలు వంటి వాటిపై జగన్‌ ఫోకస్‌ పెట్టాలని భావించారు.


దీనికి అనుగుణంగానే వచ్చిన రెండు నెలల కాలంలోనే పెద్ద ఎత్తున వివిధ పథకాలకు సంబంధించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వాటిల్లో మెజార్టీ వాటిని అమల్లో పెట్టారు. ఇంకొన్ని త్వరలో అమలు పెట్టబోతున్నారు. ఇప్పుడిప్పుడే అంతా ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో.. తన తండ్రి తరహాలోనే ప్రజా దర్బార్‌ నిర్వహించే దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారు. వచ్చే నెల నుంచి ప్రజా దర్బార్‌ పేరుతో ప్రతి రోజూ గంట నుంచి గంటన్నర పాటు ప్రజలను.. సందర్శకులను నేరుగా కలిసే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే ప్రజా దర్బార్‌ పేరుతో ప్రజలను నేరుగా కలిసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు సమాచారం. ఇకపై ఎక్కువ కాలం ప్రజలతో నేరుగా టచ్‌లో ఉంటూ వారి సాధక బాధలను స్వయంగా తెలుసుకోవాలని భావిస్తున్నట్టు సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.












మరింత సమాచారం తెలుసుకోండి: