తెలుగుదేశం పార్టీ కంగారు, కలవరం అలా ఇలా కాదుగా. జగన్ ఎన్నికల్లో గెలిచాడనగానే ఆ పార్టీ కూసాలు కదిలిపోయాయి. మే 23న రోజంతా టీడీపీ శిబిరంలో నిరాశా, నిస్ప్రుహ తాండవించాయి. ఇక చంద్రబాబు తేరుకుని రాజీనామా చేసిన తరువాత పసుపు శిబిరంలో పూర్తిగా సైలెంట్ రాజ్య‌మేలింది. జగన్నాధ రధచక్రాల కింద పడి సైకిల్ తుక్కుతుక్కుగా అయిపోయిందన్న సంగతి తమ్ముళ్ళు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి.


ఇదిలా ఉండగా ఈ రోజు జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి మీటింగులో విశాఖకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ హై కమాండ్ కి ఓ సూచన చేశారు. తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ళు సహనంతో ఉంటే మంచిదని అయ్యన్న చెప్పారు.  బంపర్ మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన పార్టీకి బండగా ఓటేసి జనం టీడీపీని పక్కన పెట్టేసారు. ఈ నేపధ్యంలో జగన్ సర్కార్ పాలన ఎలా ఉందో  చూడాలని అయ్యన్న పార్టీ నాయకులకు చెప్పారట.


టీడీపీ ఎన్నో మంచి పనులు చేసినా కూడా ప్రజలు మాత్రం జగన్ మీద మోజుతో ఓటేశారు. జగన్ ఏదో చేస్తారని జనం అనుకుంటున్నారు. అదేంటో మనం చూడాలని అయ్యన్న విలువైన సలహానే ఇచ్చారట. మనం అనవసరంగా ఇపుడు పోరాటాలు అంటూ రోడ్డెక్కినా కూడా జనానికి ఎక్కదు, పైగా మనం ఇబ్బందుల పాలు అవుతామని అయ్యన్న వివరించారట. ఆకలి వేసినపుడే అన్నం పెట్టాలి, అలాగే జనం మేము కష్టాల్లో ఉన్నామని అన్నపుడే మనం బయటకు రావాలి. ఇపుడు మనం గొంతు పెద్దది చేసి అరచినా ఉపయోగం లేదని బాబు తో సహా పార్టీ పెద్దలకు అయ్యన్న మంచి పాఠాలే చెప్పారట.


కనీసం కొంతకాలం అయినా జగన్ ప్రభుత్వానికి టైం ఇద్దామని, జగన్ వరసగా తప్పులు చేసేంతవరకూ ఓపిక పడదామని కూడా అయ్యన్న అన్నారట. మొత్తం మీద జగన్ మీద  ఓ వైపు పూనకం వచ్చినట్లుగా చంద్రబాబుతో పాటు కొందరు తమ్ముళ్ళు ఆవేశపడుతూంటే అయ్యన్న మాత్రం మంచి మాటేఅ చెప్పారని పార్టీలో అభిప్రాయం వినిపిస్తోంది. ఇపుడు జనంలోకి వెళ్తే కర్సు అయిపోవడం ఖాయమన్న అయ్యన్న మాటలు మెజారిటీ టీడీపీ నేతలు ఏకీభవిస్తున్నారుట. మరి బాబు ఈ సీనియర్ నేత సలహాతోనైనా జగన్ని తిట్టిపోయడం ఆపెస్తారా.


మరింత సమాచారం తెలుసుకోండి: