కంటికి కనిపించే నీళ్లకు ,లెక్క ప్రకారం ప్రాజెక్టుల్లో చేరే నీటికి వ్యత్యాసం ఉంటుంది. ఎన్ని నీళ్లు ఉన్నాయన్నది తెలుసుకోవటానికి నీటి కొలతను అర్ధం చేసుకోవాలి. నీటి కొలతల్లో ముఖ్యమైనవి నీటి వ్రవాహాన్ని కొలిచే క్యూసెక్ - నిమిషానికి క్యూబిక్ అడుగు చొప్పున లెక్కిస్తారు. నీటి నిలువను లెక్కకట్టే టీఎంసీ(వెయ్యి మిలియన్ క్యూబిక్). ఒక క్యూసెక్కు అంటే ఒక సెకనులో ఒక పాయింటును దాటే నీటి పరిమాణం. నీటి ప్రవాహాన్ని సహజంగా క్యూసెక్కుల్లో లెక్కకడతారు. ఒక టీఎంసీ(టీఎంసీ) అంటే వంద కోట్ల ఘనపుటడుగులు (వెయ్యి మిలియన్ క్యూబిక్). ఒక ఘనపుటడుగును సులభంగా అర్ధం చేసుకోవాలంటే  ఒక అడుగు పొడవు,ఒక అడుగు వెడల్పు,ఒక అడుగు ఎత్తు(లేక లోతు ) ఉన్న బాక్స్ నో  ,ఐస్ క్యూబ్ నో ఊహించుకోండి. ఇలాంటివి వందకోట్లు కలిస్తే ఒక టీఎంసీ అవుతుంది. ఒక టీఎంసీ = 11,574 క్యూసెక్స్.  అంటే ఒక టీఎంసీ నీరు రిజర్వాయర్లోకి చేరాలి అంటే ఒక రోజులో 11,574 క్యూసెక్కుల నీరు ప్రవహించాలి.


 శ్రీశైలం డ్యాములోకి 6,53,344 క్యూసెక్కుల నీరు అంటే 56.449 టీఎంసీ ల నీరు చేరగా దిగువకు 7,78,427 క్యూసెక్కుల నీటిని అంటే 67.256 టీఎంసీల నీటిని  వొదిలారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి సామర్ధ్యం 885 అడుగుల వద్ద 216 టీఎంసీ. నిన్న సాయంత్రానికి  శ్రీశైలంలో 880 అడుగుల వద్ద  193.41 టీఎంసీల నీరు ఉంది. అదే తుంగభద్ర డ్యాం నుంచి నిన్న సాయంత్రం 2,29,873 క్యూసెక్కుల నీటిని అంటే 19.86 టీఎంసీ ల నీటిని వొదిలారు. ఈ నీటిలో కర్ణాటక పరిధిలోని చిన్న చిన్న లిఫ్ట్ ల ద్వారా కొంత మేర నీటిని ,తెలంగాణా ఆర్ డిఎస్ కొంత నీటిని వాడుకున్నా  కనీసం 12-13 టీఎంసీల నీరు కర్నూల్ జిల్లాలోని  సుంకేసుల డ్యాముకు చేరుతుంది. సుంకేసుల డ్యాం నిలువ సామర్ధ్యం కేవలం 1.25 టీఎంసీ. ఈ నీటినిసుంకేసుల నుంచి కేసీ కెనాల్ కూ ,  కర్నూల్ పట్టణానికి నీటిని ఇవ్వాలి. కర్నూల్ టౌన్ లో ఈ వారంలో కూడా తాగునీటి కోసం ప్రజలు ధర్నా చేశారు. కర్నూల్ పట్టాణాన దాహార్తిని తీర్చాలంటే సుంకేసుల డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్లు తోడాలి. ఎగువు నుంచి నీళ్లు వస్తున్నాయని అంచనా ఉన్నప్పుడు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణం నిర్ణయం తీసుకొని సుంకేసుల నుంచి నీళ్లు విడుదల చేస్తే బాగుండేది. 



శ్రీశైలానికి మంగళవారం కనీసం 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జున సాగర్ లో కూడా సోమవారం సాయంత్రానికి 196 టీఎంసీ ల నీరు చేరింది. సాగర్ పూర్తిస్థాయి నిలువ సామర్ధ్యం 312 టీఎంసీ లు. సాగర్ కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ దిగువున పులిచింతల లో ఒక టీఎంసీ, ప్రకాశం బ్యారేజిలో  పూర్తి స్థాయిలో 3 టీఎంసీల నీరు ఉంది. మొత్తంగా అన్ని ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉంది. ఇప్పుడు ఆలోచించాల్సింది రాయలసీమకు నీరు ఇవ్వటం గురించి. వరద ఉన్నప్పుడే రాయాలసీమకు నీళ్లు అందేది.  ఆగస్ట్ తరువాత  శ్రీశైలం నీరు దిగువకు పోవటమే ఎక్కువ. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహం, దిగువకు వొదులుతున్న అవుట్ ఫ్లో లెక్కల ఆధారంగా శ్రీశైలంలో 880 అడుగులకు మించి నీరు ఉన్నట్లుగా గుర్తించాలి. శ్రీశైలం మీద ఆధారపడ్డ తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ(శ్రీశైలం కుడికాలువ), గాలేరు-నగరిలతో పాటుగా హంద్రీ-నీవాలకు నీరు ఇవ్వాలి. 



పోతిరెడ్డిపాడు నుంచి కనీసం 35,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ కింద ఉన్న వెలుగోడు, బ్రహ్మం  సాగర్ రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో అంటే రెండు ప్రాజెక్టులు కలిపి 30 టీఎంసీల  నీటిని  నింపాలి. తెలుగు గంగ  ద్వారా  నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరుకు అక్కడి నుంచి  చెన్నైకి తాగు నీరు అందుతుంది. సోమశిల(78 టీఎంసీ ), కండలేరు(68 టీఎంసీ)లకు కనీసం 60 టీఎంసీ ఇవ్వాలి. ఈ రెండు ప్రాజెక్టులకు కుందు, పెన్నా నదుల నుంచి 15-20 టీఎంసీ ల నీరు  అందే అవకాశం ఉంది.  ఎస్ ఆర్బీసీ ద్వారా  అవుకు, గండికోటకు కనీసం 15 టీఎంసీ ల నీటిని ఇవ్వాలి. గండికోట కింద ఉన్న పైడిపాలెం ద్వారా చిత్రావతి లింకుకు, సర్వారాయ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలి. మొత్తంగా వరదనీరు ఉన్నప్పుడే పోతిరెడ్డి పాడు నుంచి 100-120 టీఎంసీ నీరు ఇవ్వాలి. హంద్రీ-నీవా ఎత్తిపోతల ద్వారా పశ్చిమ కర్నూల్ (పత్తికొండ ప్రాంతం), అనంతపురానికి నీళ్లు ఇవ్వాలి. 2500 క్యూసెక్కుల నీటిని కనీసం 30 రోజులు విడుదల చెయ్యాలి. తుంగభద్రా డ్యామ్ నిండటం వలన  చాలా సంవత్సరాల ద్వారా హెచ్ సీఎల్ ద్వారా ఈ ఏడాది అనంతపురానికి 25-30 టీఎంసీ ల నీరు వొచ్చే అవకాశం ఉంది. 



నీటిని వాడుకోవటంలో అధికారులు చాలా క్రియాశీలకంగా ఉండాలి. 8 లక్షల కుసెక్కుల నీటిని సరిగా వినియోగించుకోకుండా కిందికి సాగరుకు వొదిలితే సాగర్ కుడి, ఎడమ కాలువల కింద అంత పెద్ద వరద నీటిని పారించటానికి వాటి సామర్ధ్యం సరిపోదు. కుడి మరియు ఎడమ కాలువ డిశ్చార్జ్ కెపాసిటీ 10,996 క్యూసెక్స్ , అంటే రెండు కాలువలకు  పూరి సామర్ధ్యం నీళ్లు వొదిలినా ఒక రోజుకు 1. 9 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల  చెయ్యగలరు.  ప్రకాశం బ్యారేజి ఇప్పటికే 100 శాతం నిండి ఉంది. శ్రీశైలం నీరు సముద్రం పాలు కాకుండా సద్వినియోగం చేసుకోవాలి.
ప్రస్తుతం పోతిరెడ్డిపాడు నుంచి 24,000క్యూసెక్కుల, హంది-నీవా నుంచి 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద నిలకడగా వస్తుంది. మరో 15 రోజులు పాటు ఈ ప్రవాహం కొనసాగుతుందని అంచనా ఉంది. కానీ వరద నీరు సముద్రం పాలు కాకుండా వినియోగించుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: