ఎన్నాళ్లో వేచిన ఉద‌యం నేడే అన్న‌ట్టుగా ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం గ‌త మూడు, నాలుగేళ్లుగా క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తోన్న రాజ‌కీయ పార్టీల‌కు, రాజ‌కీయ నేత‌ల‌కు గుడ్ న్యూస్ రానే వ‌చ్చేసింది. ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కన్పిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉంది. విభజన చట్లంలో పేర్కొంది. 


గత మోదీ ప్రభుత్వ హయాంలోనే సీట్ల పెంపు జరగాల్సి ఉంది. ఏపీలో యాభై స్థానాలను, తెలంగాణాలో 34 స్థానాలను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ముందు సీట్ల పెంపున‌కు సానుకూలంగా ఉన్న అప్ప‌టి మోదీ ప్ర‌భుత్వం త‌ర్వాత రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌తో గ్యాప్ రావ‌డంతో ఈ అంశాన్ని ప‌క్క‌న పెట్టేసింది. ఇక ఇప్పుడు ఈ రెండు చోట్ల రాజ‌కీయంగా బ‌ల‌ప‌డాల‌ని చూస్తోన్న బీజేపీ అధిష్టానం సీట్ల పెంపుపై సానుకూలంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.


ఇక తాజాగా జ‌మ్మూక‌శ్మీర్‌లో ద‌శాబ్దాలుగా ఉన్న ఆర్టిక‌ల్ 370వ నిబంధ‌న ర‌ద్దు చేయ‌డంతో పాటు క‌శ్మీర్‌ను రెండుగా విభ‌జించి కేంద్ర‌పాలిత ప్రాంతంగా మార్చేసింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఉన్న అసెంబ్లీ సీట్ల‌ను పెంచేందుకు కేంద్రం నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్ల‌ను పెంచాల‌ని బీజేపీ సూత్రాభిప్రాయ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు వారం రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 


ఇదిలా ఉంటే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఏపీ, తెలంగాణలో సీట్ల పెంపు వ్యవహారాన్ని ఏపీ బీజేపీ సీనియర్ నేతకు అమిత్ షా అప్పగించినట్లు తెలిసింది. వచ్చే వారం దీనిపై అమిత్ షా సమావేశం కానున్నారని సమాచారం. ముందుగా అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ పక్షాల నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. ఆ త‌ర్వాత పున‌ర్విభ‌జ‌న‌పై చ‌ర్చ‌లు ఉంటాయ‌ని.. అంద‌రి అభిప్రాయాలు తీసుకున్నాక ఓ ప్ర‌త్యేక క‌మిష‌న్ వేసి నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచుతారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: