పోలవరం ప్రాజెక్టు  రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న వైకాపా ప్రభుత్వ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తప్పుపట్టింది . హైదరాబాద్ లో అత్యవసరంగా సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ , రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయం కరెక్టు కాదని అభిప్రాయపడింది . రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం ద్వారా  నిర్మాణ వ్యయం పెరుగుతుందని , ప్రాజెక్టు నిర్మాణం లోనూ జాప్యం జరుగుతుందని  పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఆర్ కె జైన్ అన్నారు .


 పోలవరం ప్రాజెక్టు గుత్తేదారు పనితీరు సంతృప్తికరంగా ఉందని చెప్పారు . ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం వల్ల ఎంత వ్యయం  పెరుగుతుందన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టమని అన్నారు . సుమారు ఐదు గంటలపాటు సమావేశమైన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ , ఇప్పటి వరకు పోలవరం పనులు ఎలా జరిగాయన్న దానిపై సమీక్షించడం తోపాటు , ఆర్ అండ్  ఆర్ అమలు తీరు పై చర్చించారు . ఈ సమావేశం లో కేంద్ర జలవనరుల సంఘం అధికారులతోపాటు , ఏపీ నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు .  పోలవరం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని భావిస్తోన్న జగన్ సర్కార్ , పనులు ఆపివేయాలంటూ  గుత్తేదారు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే .


 పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సరికాదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పిన జగన్ సర్కార్ మాత్రం ససేమిరా అంటోంది . ఖచ్చితంగా రివర్స్ టెండరింగ్ కు వెళ్తామని స్పష్టం చేస్తోంది . అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో గత టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడడం వల్లే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు .   


మరింత సమాచారం తెలుసుకోండి: