అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎట్ట‌కేల‌కు జ్ఞానోద‌యం అయింది. భార‌త్‌, పాక్ అంగీక‌రిస్తేనే క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిగా వ‌స్తాన‌ని ట్రంప్ చెప్పారు. అయితే, తాజాగా ట్రంప్ మాట మార్చారు. క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయ‌బోన‌ని డోనాల్డ్ ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని అమెరికాలోని భార‌తీయ దౌత్యాధికారి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ష్రింగ్లా తెలిపారు. భార‌త్‌, పాకిస్థాన్ దేశాలు క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ద్వైపాక్షికంగా చ‌ర్చించుకునే ఉంద‌న్న విష‌యాన్ని గౌర‌విస్తున్న‌ట్లు అమెరికా అధ్యక్షుడు స్ప‌ష్టం చేశారు. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అత్యంత ఇష్ట‌మైన ఫాక్స్ న్యూస్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈవిష‌యాన్ని వెల్ల‌డించారు.

ఇటీవ‌ల జ‌పాన్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో పాల్గొన్న ట్రంప్‌.. అక్క‌డ మోదీతో క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఆ త‌ర్వాత ఇమ్రాన్‌తోనూ ఇదే విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో క‌శ్మీర్ అంశం ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే భార‌త ప్ర‌భుత్వం తాజాగా ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయ‌డంతో మ‌ళ్లీ క‌శ్మీర్ అంశం వివాదాస్ప‌దంగా మారింది. అయితే, తాజాగా ఇంట‌ర్వ్యూలో క‌శ్మీర్ అంశం త‌న ఎజెండాలో లేద‌ని ట్రంప్ చెప్పిన‌ట్లు దౌత్యాధికారి  హ‌ర్ష‌వ‌ర్థ‌న్ క్లారిటీ ఇచ్చారు. త‌న మ‌ధ్య‌వ‌ర్తిత్వం ఆఫ‌ర్‌ను ఇండియా ఆహ్వానించ‌లేద‌ని, దాంతో ఆ అంశాన్ని ట్రంప్ వ‌దిలేశార‌ని హ‌ర్ష‌వ‌ర్థ‌న్ చెప్పారు. క‌శ్మీర్ భ‌ద్ర‌త గురించి భార‌త ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు. రెండు దేశాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌ను ద్వైపాక్షికంగానే ప‌రిష్క‌రించుకోవాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్ తెలిపారని ఆయ‌న వివ‌రించారు. ద్వైపాక్షిక అంశాల్లో మూడో ప‌క్షం జోక్యం ఉండ‌బోద‌ని, ఇదే విష‌యాన్ని ట్రంప్ స్ప‌ష్టీక‌రించార‌ని తెలిపారు.


గత నెలలో అమెరికా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి జులై 22న డొనాల్డ్ ట్రంప్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం చేయాలని భారత ప్రధాని తనను కోరినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర దుమారమే రేగింది.. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను భారత్ కొట్టిపారేసింది. మోదీ, ట్రంప్‌ మధ్య కశ్మీర్‌ ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత కొంచెం మాట మార్చి కశ్మీర్‌ సమస్య భారత్‌, పాక్‌ ద్వైపాకిక్ష అంశమే.. అయితే ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కోసం మా సాయం కోరితే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని తెలిపారు 

మరింత సమాచారం తెలుసుకోండి: