ఎంఐఎం పార్టీ అధినేత‌, హైద‌రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోని వివిధ రాజ‌కీయ ప‌రిణామాల‌తో స‌హా వివిధ అంశాల‌పై ఓవైసీ ఘాటు కామెంట్లు చేశారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో ఓవైసీ మాట్లాడుతూ,  ప్రధాని నరేంద్ర మోదీ మండిప‌డ్డారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రుకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ప్రధాని నరేంద్ర మోదీకి లేదు అని ఆరోపించారు. జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌త‌ప‌త్తి క‌ల్పిస్తున్న ఆర్టిక‌ల్ 370 విష‌యంలో ఓవైసీ ఈ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 


దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రు కశ్మీర్‌ అంశంపై సరైన నిర్ణయం తీసుకున్నారని ఓవైసీ తెలిపారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కూడా ఆర్టికల్‌ 370ను అంగీకరించిన విషయం మోదీకి తెలువదు అని ఓవైసీ గుర్తు చేశారు. ``ఎన్డీయే ప్రభుత్వం కశ్మీర్‌ను ప్రేమిస్తుంది కానీ, కశ్మీరీలను కాదు. కశ్మీర్‌ భూమిపై ప్రేమ ఉంది కానీ.. అక్కడ నివసిస్తున్న ప్రజలపై మోదీకి ప్రేమ లేదు. న్యాయాన్ని వదిలేసిన బీజేపీ నాయకులు.. మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఎవరికైనా ఏది శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి`అని ఓవైసీ స్పష్టం చేశారు. 


కాగా,  గత కొద్ది రోజుల నుంచి కేరళ, మహారాష్ట్రతో పాటు కర్ణాటకలు భారీ వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. కేరళలో ఇప్పటి వరకు 91 మంది మృతి చెందగా, 59 మంది అదృశ్యమయ్యారు. 14 జిల్లాల్లో వరద ముంపునకు గురయ్యాయి. మహారాష్ట్రలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దీనిపై ఓవైసీ త‌న‌దైన శైలిలో స్పందించారు. హైద‌రాబాద్‌లో  భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ, మహారాష్ట్ర రాష్ర్టాలకు తన వంతు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ రెండు రాష్ర్టాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లో ఓవైసీ మంగళవారం ప్రకటించారు. ఈ నగదును నేరుగా ఆయా రాష్ర్టాల చీఫ్‌మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేస్తామని ఓవైసీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: