కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓ రేంజ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌న‌కు అందివ‌చ్చిన అవ‌కాశంతో జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను గుక్క‌తిప్పుకోనివ్వ‌కుండా కౌంటర్‌ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటూ వార్తలు వస్తున్నాయన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ మండిపడ్డ విషయం విదితమే. ఈ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ ఊహించ‌ని రీతిలో స్పందించారు.

క‌శ్మీర్‌లో 370, 35 ఏ అధికరణల రద్దు నేపథ్యంలో అక్క‌డ‌ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయని, ప్రధాని మోదీ శాంతియుత చర్యలు చేపట్టాలని రాహుల్ ఇటీవల అన్నారు. దీనిపై గవర్నర్ సోమ‌వారం స్పందించారు. రాహుల్ గాంధీ ఇక్కడకు రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఇక్కడి పరిస్థితిని కళ్లారా చూసేందుకు ఆయన కోసం విమానం పంపిస్తానన్నారు. కశ్మీర్‌లో ప‌రిస్థితుల విష‌యంలో కామెంట్లు చేసే ముందు...కశ్మీర్ పరిస్థితిని కళ్లారా చూసి మాట్లాడాలని గ‌వ‌ర్న‌ర్ మాలిక్ చేసిన వ్యాఖ్య‌ల‌కు రాహుల్ గాంధీ నిన్న కౌంట‌ర్ ఇచ్చారు. త‌న ట్విట్ట‌ర్‌లో గ‌వ‌ర్న‌ర్ మాలిక్ ఆహ్వానాన్ని స్వాగ‌తించారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో క‌లిసి క‌శ్మీర్‌లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌మ‌కు విమానం అవ‌స‌రం లేద‌ని, కానీ క‌శ్మీర్‌లో స్వేచ్ఛ‌గా తిరిగే ప‌రిస్థితుల‌ను క‌ల్పించాల‌న్నారు. స్థానిక ప్ర‌జ‌ల‌ను, ముఖ్య నేత‌ల‌ను, సైనికుల‌ను క‌లుసుకుంటామ‌ని రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌లో చెప్పారు. 


రాహుల్ గాంధీ ఈ ట్వీట్‌కు కొనసాగింపుగా...తాజాగా మరో ట్వీట్ చేశారు. ``డియర్‌ మాలిక్‌ జీ.. నా ట్వీట్‌పై మీ పస లేని స్పందన చూశాను. జమ్మూకశ్మీర్‌కు రావాలన్న మీ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను. ఎలాంటి షరతులు లేకుండా అక్కడి ప్రజలను కలుస్తాను. నేను ఎప్పుడు రావొచ్చు?`` అని గ‌వ‌ర్న‌ర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను మ‌ళ్లీ రాహుల్‌ గాంధీ కెలికారు. దీనికి మాలిక స్పంద‌న ఏం ఇస్తారో మ‌రి.!

మరింత సమాచారం తెలుసుకోండి: