ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించిన పాకిస్తాన్.. అప్పటి నుంచి ఇండియా ప్రభుత్వంపై విషంకక్కుతూనే ఉంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్ నిర్ణయాన్ని తప్పుబడుతూ...తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు పాక్ ప్రధాని ఇమ్రాన్ కేంద్ర ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేశారు.


జమ్మూ-కశ్మీర్ విషయంలో భారత్ తప్పక మూల్యం చెల్లించుకుంటుందని, కశ్మీర్‌లో పౌరులపై జరుగుతున్న దాడులు, అక్కడ నెలకొన్న సంక్షోభం కారణంగా పడుతున్న కష్టాల గురించి తాము చింతిస్తున్నామని అన్నారు. అసలు భారత ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదం చేసిందని,  కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ సమాజం మాట్లాడకపోవచ్చనని, కానీ కశ్మీరీల తరఫున తాను మాట్లాడతానని చెప్పారు. 


ఇక అన్ని వేదికలపై కశ్మీర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉంటానని, . ప్రస్తుత విషయాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తాను మాట్లాడానని తెలిపారు. ఇక గత 20 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు తమ సైనిక దళం శ్రమిస్తోందని చెప్పారు. అలాగే భారత్‌లో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పాక్‌ ఆర్మీ, ప్రజలు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నారని అన్నారు. 


కశ్మీరీల హక్కుల ఉల్లంఘనలను ఎంతమాత్రం సహించబోమని, భారత్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నమంటూ ఇండియాకి హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే పాక్ ప్రజలు కశ్మీర్‌పై భ్రమల్లో జీవించడం ఆపేయాలని ఆ దేశ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషీ హితవు పలికిన విషయం తెలిసిందే. ఐరాస మద్దతు పొందేందుకు కొత్తగా పోరాటం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఖురేషీ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ఇమ్రాన్‌ఖాన్‌ యుద్ధానికి సిద్ధమంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: