అధికార పీఠం అధిరోహించిన దగ్గర నుంచి సీఎం జగన్ అవినీతి లేని పాలనే అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అనేకసార్లు చెప్పిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఆయన ఆ దిశగా పాలన కొనసాగుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికేతీసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఒకవైపు అవినీతిపై యుద్ధం చేస్తున్న తన పైనే చాలా ఒత్తిళ్ళు వచ్చాయని సీఎం జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.


బుధవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ... అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని, ఒత్తిళ్లను అస్సలు పట్టించుకోవద్దని ఆయన సూచించారు. అయితే తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని, కానీ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. అలాగే టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకు వచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏదిచూసినా వందలు, వేలకోట్ల రూపాయల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని సీఎం ఆరోపించారు.


అటు ఇళ్ల నిర్మాణం తీసుకున్నా అదే పరిస్థితి ఉందని, అవినీతి లేకుంటే అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు లభించేవి అని జగన్ మంత్రులతో అన్నారు. ఇటు రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని, దీని వల్ల మిగిలే ప్రతిపైసా ప్రజలకే చెందుతుందని గుర్తుంచుకోవాలని మంత్రులకు స్పష్టం చేశారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో మన రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి సహకరించాలని మంత్రులని కోరారు.


కాగా, గత టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీసేందుకు జగన్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ఈ మంత్రివర్గ ఉప సంఘంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వీరంతా గ‌త ప్రభుత్వ హ‌యాంలో జ‌రిగిన ప‌నుల డేటాను తీసుకుని స‌మీక్షిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: