కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచి అనంత‌రం టీఆర్ఎస్‌లో చేరిన ఓ ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌నకు భద్రత కల్పిస్తున్న గన్ మెన్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  వెనక్కు పంపారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, తనకు ఎటువంటి ప్రాణ భయం లేదని, అందుకే, గన్ మెన్లను నిరాకరిస్తున్నట్టు కాంతారావు ప్రకటించారు. తన నియోజకవర్గ ప్రజలే తనకు రక్షణగా నిలుస్తారని రేగా కాంతారావు ప్ర‌క‌టించారు.  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గన్‌మెన్లను వెనక్కి పంపే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 


హంగుఆర్భాటాలతో ప్రజల్లోకి వెళ్లడం ఇష్టంలేదని అందుకే తన గన్‌మెన్‌లను ఆరుగురిని వెనక్కి పంపడం జరిగిందన్నారు. తన నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు అన్ని గ్రామాల్లో ప్రజలను స్వచ్ఛందంగా కలుసుకొని స్వాతంత్య్ర దినోత్సవం నుంచి స్వేచ్ఛగా ఉండాలని తన గన్‌మెన్లను వెనక్కి పంపినట్లు తెలిపారు. తనకు ప్రతి పల్లెలో పరిచయాలు ఉన్నాయని, ఎలాంటి ప్రాణభయం లేదని, ఎప్పుడు తప్పు చేయలేదని, తన నియోజకవర్గ ప్రజలే తనకు రక్ష అని చెప్పారు. ఈ నెల 15నుంచి తనకు ప్రభుత్వం కేటాయించిన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపుతున్నట్లు చెప్పారు.


కాగా, రేగా కాంతారావు సంచ‌ల‌న ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి గెలిచిన టీఆర్ఎస్‌లో చేరిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ,  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ రూ. 50 లక్షల చొప్పున ఆఫర్‌ చేసిందని తెలిపారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ తమకు ఎలాంటి డబ్బు ఆఫర్‌ చేయలేదని, కేవలం ఆదివాసీల అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని తేల్చిచెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతామని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఒకవేళ డబ్బులకు అమ్ముడుపోవాలనుకుంటే.. కాంగ్రెస్‌ పార్టీతోనే రూ. 50 లక్షలు తీసుకునే వాళ్లం కదా? అని రేగా కాంతారావు ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: