ఒక్కసారి  ప్రజాప్రతినిధి అయితే  చాలు   సకల సౌకర్యాలు, వెంట నడిచే అనుచరులు ... ఆర్డర్ వేస్తే అన్ని క్షణాల్లో సమకూరుతాయి . ఇక ఎమ్మెల్యే అంటే మాటలా... రాజభోగానికి  తక్కువేమీ ఉండదు అయ్యవార్ల  వైభోగం. అయితే ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రం అతి సాధారణంగా జీవిస్తారు. సాధారణ వ్యక్తిగా ఉండడానికే ఇష్టపడుతారు .  ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇప్పటికి రోడ్డు పక్కనే భోజనం చేయడం , ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ఆయన ప్రత్యేకత .. అంతలా సింపుల్‌గా ఉండే మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హైదరాబాద్‌లో ఐదు రూపాయల భోజనం చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.


బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ దగ్గర జీహెచ్‌ఎంసీ అద్వర్యం లో  ఏర్పాటు చేసిన 5 రూపాయలకే భోజనం తింటూ ఆయన అందరి దృష్టి ఆకర్షించారు .    ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే రూపురేఖలు, జీవన విధానం మారిపోతుంది. అలాంటిది గుమ్మడి నర్సయ్య ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన కామన్ మ్యాన్‌లాగే ఉంటూ , ప్రస్తుత తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు . ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు గుమ్మడి నర్సయ్య. 1983, 1985, 1989, 1999, 2004లో శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఎమ్మెల్యేగా  ఐదు సార్లు గెలుపొందినప్పటికీ ఆయనలో ఏనాడు ఆర్భాటాలకు పోలేదు .


 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా.. ఇప్పుడైనా.. సైకిల్‌పైనే తిరుగుతారు. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. అదే ఆయన ప్రత్యేకత . మరి నేడు  ఎమ్మెల్యేలు అంటే ప్రజాసేవకుడన్న విషయాన్నీ మర్చిపోయి , ప్రజల నెత్తిన ఊరేగేందుకే ప్రయత్నిస్తుంటారు. గుమ్మడి నర్సయ్య లాంటి ప్రజాప్రతినిధులు అరుదుగా ఉంటారు . వారు తమ జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తూ , ప్రజాసేవలోనే ఆనందిస్తున్నారు . అటువంటి వారిని చరిత్ర ఎప్పుడు గుర్తుకు పెట్టుకుంటుంది తప్పిస్తే అవినీతి బకాసురులు కాదన్నది జగమెరిగిన సత్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: