ఏపీ ముఖ్యమంత్రి జగన్ వారం రోజుల పాటు అమెరికా టూర్ పెట్టుకున్నారు. ఈ రోజు ఆయన అమరావతి నుంచి బయల్దేరి అమెరికా చేరుకుంటారు. అక్కడ వారం పాటు ఆయన గడిపి తిరిగి ఈ నెల 23న అమరావతి వస్తారు. అంటే ఓ ముఖ్యమంత్రి లేకుండా వారం రోజుల పాటు ఏపీలో పాలన సాగుతుంది అన్న మాట. జగన్ సీఎం అయ్యాక ఇది రెండవ విదేశీ పర్యటన. ఈ పర్యటన పూర్తిగా ప్రైవేట్ గానే సాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 


దీనికి అయ్యే ఖర్చు కూడా జగన్ సొంతంగా భరిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా జగన్ ఇదే నెలలో 1వ తేదీ నుంచి 4 వరకూ జెరూసలెం టూర్ చేశారు. అది కేవలం నాలుగు రోజులే కాబట్టి ఫర్వాలేదు. ఇపుడు వారం రోజులు టూర్ ప్రోగ్రాం వుంది. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి అందుబాటులో లేకుండా పాలన సాధ్యమేనా అన్న డౌట్లు రావడం సహజం. మరి జగన్ దీనికి తరుణోపాయం ఏమైనా సిధ్ధం చేసి ఉంచారా అన్నది తెలియడంలేదు.


ఏపీలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ సీనియర్, పైగా జగన్ కి సన్నిహితుడు. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ సాగుతోంది. చిత్తూరుకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి జగన్ కి బాగా దగ్గరివారు. ఆయన్ని పాలనాపరంగా చూడమని కోరతారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. అదే విధంగా బాలినేని  శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు కూడా జగన్ క్యాబినెట్లో ఉన్నారు.


మరి వీరిలో ఎవరికైనా తాను లేని సమయంలో అత్యవసర సందర్భాల్లో పాలనా వ్యవహారాలు చూడమని జగన్ అప్పగించారా లేదా అన్నది చర్చగా ఉంది. అయితే జగన్ ఎవరికీ ఏ బాధ్యత అప్పగించకపోవచ్చునని, మొత్తానికి మొత్తం తానే అమెరికా నుంచే మోనిటరింగ్ చేసుకుంటారని అంటున్నారు. గతంలో చంద్రబాబు పలుమార్లు విదేశీ టూర్లకు వెళ్ళినపుడు కూడా ఇదే విధానం అవలంబించారని అంటున్నారు.


వీటన్నిటికీ మించి మరో సెంటిమెంట్ కూడా ఉంది. అమెరికా టూర్ కి సీఎం వెళ్తే కుర్చీ జారిపోతుందని నిన్ననే కర్ణాటక   మాజీ సీఎమ్ కుమార‌స్వామి ఉదంతం రుజువు చేసింది. ఏపీ విషయానికి వస్తే 1984లో అన్న నందమూరి అమెరికా టూర్లో ఉండగానే నాదెండ్ల వెన్నుపోటు పొడిచి నెల రోజుల సీఎం అయిన ఘటన కళ్ల ముందే ఇంకా ఉంది. ఇక అలిపిరి బాంబు దాడిలో చంద్రబాబు గాయపడినపుడు నంబర్ టు గా భావిందే దేవెందర్ గౌడ్ అప్పట్లో ఓవయాక్షన్ చేశారన్న కధలూ ఉన్నాయి. వీటన్నిటి ద్రుష్ట్యా సీఎం లు నంబర్ టు లనే పక్కన పెట్టేశారు. సో జగన్ కూడా రిమోట్ కంట్రోల్ పాలనే చేస్తారంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: